indian cricket team: బౌలర్ల కోసం బిజినెస్‌క్లాస్‌ సీట్లు వదులుకొన్న ద్రవిడ్‌, రోహిత్‌, కోహ్లీ..!

బౌలర్ల ఇబ్బందిని గుర్తించిన టీమ్‌ ఇండియా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. వారిని సౌకర్యవంతంగా ఉంచేందుకు సీనియర్‌ ఆటగాళ్లకు తమకు ఇచ్చిన బిజినెస్‌ క్లాస్‌ సీట్లను వదులుకొన్నారు. 

Published : 09 Nov 2022 01:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కప్‌ కోసం టీమ్‌ ఇండియా చిన్నచిన్న విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉంటోంది. జట్టులో తోటి సభ్యుల అవసరాల కోసం మిగిలిన ఆటగాళ్లు త్యాగాలు చేశారు. తాజాగా అటువంటి నిర్ణయం ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమ్‌ ఇండియా కోచ్‌,  జట్టు కీలక సభ్యులు కొందరు తమకు కేటాయించిన  సౌకర్యాలను బౌలర్లకు ఇచ్చారు. కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు తమకు ఇచ్చిన బిజినెస్‌ క్లాస్‌ సీట్లను బౌలర్లు మహమ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్, పాండ్యాకు ఇచ్చారు. టోర్నికి ముందే దీనికి సంబంధించి జట్టు నిర్ణయించుకొంది. బౌలర్లు మైదానంలో పూర్తిస్థాయిలో ప్రతిభ చూపాలంటే.. ఫీల్డ్‌ బయట వారి కాళ్లు, వెన్నెముకకు వీలైనంత విశ్రాంతి కల్పించాలని భావించారు. ఈ విషయాన్ని జట్టులోని సిబ్బంది ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టుకు నాలుగు బిజినెస్‌ క్లాస్‌ సీట్లు కేటాయిస్తారు. చాలా జట్లలో ఈ సీట్లను కోచ్‌, కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు లేదా వైస్‌ కెప్టెన్‌‌, మేనేజర్‌కు కేటాయిస్తాయి. కానీ, భారత వ్యూహ బృందం మాత్రం ఆస్ట్రేలియాలో ప్రతి మూడు నాలుగు రోజులకోసారి విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని దృష్టిలోపెట్టుకొంది.  ఈ నేపథ్యంలో జట్టులోని పేసర్లకు వీలైనంత సౌకర్యవంతమైన సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. దీంతో సాధారణంగా జట్టులో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను పొందేవారు.. వాటిని బౌలర్లకు వదులుకొన్నారు. టోర్నమెంట్‌ పూర్తయ్యే నాటికి జట్టు మూడు టైమ్‌ జోన్లలో 34,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో స్థానిక విమాన ప్రయాణాలే కనీసం నాలుగైదు గంటలు ఉంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని