Rahul Dravid: ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Dravid: టీమ్‌ఇండియా కోచ్‌ పదవి నుంచి దిగిపోయిన రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు.

Updated : 01 Jul 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జట్టుకు పొట్టి ప్రపంచకప్‌ను అందించి కోచ్ పదవిని ఘనంగా ముగించాడు రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid). ఎప్పుడూ గంభీరంగా కన్పించే అతడు.. ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team India) గెలవగానే ఇతర ఆటగాళ్లతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయాడు. జట్టుతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలుంటే చెప్పండి’ అంటూ సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఘన విజయం (T20 World cup 2024) నుంచి ఎలా ముందుకుసాగనున్నారు అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ద్రవిడ్‌ (Coach Rahul Dravid) స్పందిస్తూ.. ‘‘ఈ ఆనందం నుంచి తేరుకుని ముందుకు సాగాలి. అయితే, వచ్చేవారం నుంచి నా జీవితంలో పెద్దగా మార్పేమీ ఉండదు. కాకపోతే ఇక నేను నిరుద్యోగిని.. ఇదొక్కటే తేడా’’ అని బదులిచ్చారు. ‘మీ వద్ద ఏమైనా ఆఫర్లు ఉన్నాయా?’ అంటూ విలేకరులను సరదాగా ప్రశ్నించాడు.

శ్రీలంక టూర్‌కు కొత్త హెడ్ కోచ్‌.. మా నెక్ట్స్‌ టార్గెట్ ఆ రెండు టైటిల్స్‌: జై షా

టీమ్‌ఇండియా కోచ్‌ (Team India Coach)గా మరికొంతకాలం కొనసాగాలని బీసీసీఐ కోరినా.. ద్రవిడ్‌ అందుకు తిరస్కరించాడు. దీంతో కొత్త కోచ్‌ కోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై గతంలో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘కోచ్‌గా కొనసాగేలా ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించా. కానీ ఆయనకు చాలా కారణాలు ఉంటాయి కదా..! ఏదేమైనా ద్రవిడ్‌తో గడిపిన సమయం చాలా విలువైనది. నా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆయనే కెప్టెన్‌. టెస్టుల్లోనూ ఆయన సారథ్యంలో ఆడే అవకాశం లభించింది. ఆయన మాకు రోల్‌మాడల్‌’’ అని అన్నాడు.

వెస్టిండీస్‌ వేదికగా 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఘోరంగా ఓడిపోయి గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కెప్టెన్సీ వదిలేశాడు. సారథిగా సాధించలేని దాన్ని అదే కరీబియన్‌ గడ్డపై కోచ్‌గా సాధించి ఓ జీవితకాల వెలితిని పూడ్చుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని