SKY-Dravid: చిన్నప్పుడు నా ఆటను చూసి ఉండవు కదా..? సూర్యతో ద్రవిడ్‌ సరదా ఇంటర్వ్యూ

కొత్త సంవత్సరంలో శ్రీలంకపై భారత్‌ (IND vs SL) టీ20 సిరీస్‌ను నెగ్గి శుభారంభం చేసింది. సూర్యకుమార్‌ యాదవ్ (Surya Kumar Yadav) సుడిగాలి ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సెంచరీ సాధించి మూడో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రత్యేకంగా ముచ్చటించాడు. 

Published : 08 Jan 2023 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ‘మిస్టర్ 360’ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav).. తనదైన స్టైల్‌లో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వీక్షించాం. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను (IND vs SL 2023) భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకొంది. హార్దిక్‌-రాహుల్‌ ద్రవిడ్‌ (Hardik - Dravid) సారథ్యంలో టీమ్‌ఇండియా కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. సూపర్ సెంచరీతో ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికైన సూర్యకుమార్‌ను మ్యాచ్‌ అనంతరం ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ద్రవిడ్‌ ఎంతో సరదాగా సూర్యను ప్రశ్నలు అడగడంతో అభిమానులు ఫిదా అయ్యారు. ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్‌ను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది. అయితే పూర్తి వీడియో కావాలంటే మాత్రం బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాల్సిందే.

సూర్యకుమార్‌ను పరిచయం చేస్తూ.. ఇక్కడ మన దగ్గర ఉన్న బ్యాటర్‌ మీకు తెలుసు.. అయితే కుర్రాడిగా ఉన్నప్పుడు నా బ్యాటింగ్‌ను చూడనివారిలో అతడు కూడా ఉంటాడు (నవ్వుతూ).. అని ద్రవిడ్‌ అనగా..

ద్రవిడ్‌ ప్రశ్నకు సూర్యకుమార్‌ కూడా నవ్వుతూ.. ‘నేను చూశాను’ అని సమాధానం ఇచ్చాడు. అయితే ద్రవిడ్ కలగజేసుకొని ‘‘నువ్వు చూసి ఉండవనే నేను అనుకుంటున్నా. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇంటర్వ్యూ సాగిందిలా..

ద్రవిడ్‌: ప్రతి మ్యాచ్‌ తర్వాత ఇంతకంటే అద్భుతమైన టీ20 ఇన్నింగ్స్‌ను చూడలేమోనని అనుకొనేవాడిని. అయితే నీ సూపర్ ప్రదర్శనతో మరిచిపోయేలా చేశావు. గత ఏడాది కాలంలో ప్రత్యక్షంగా నీ ఆటను చూడటం గర్వంగా భావిస్తా. ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఉత్తమమైనది ఎంచుకోమంటే .. దేనిని సెలెక్ట్‌ చేసుకుంటావు?

సూర్య: క్లిష్ట పరిస్థితుల్లో ఆడటం నాకెంతో ఇష్టం. అయితే నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఒకదానిని ఎంచుకోవడమంటే కొంచెం కష్టమే. బ్యాటింగ్‌ను చేయడాన్ని ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తా. బ్యాటింగ్‌కు దిగినప్పుడు నేనేం చేయగలనో అదే సంతోషంగా చేసేందుకు ప్రయత్నిస్తా. 

ద్రవిడ్‌: విభిన్న షాట్లను కొట్టే క్రమంలో ముందే అలాంటివాటిని అంచనా వేసి ఆడతావా..? లేకపోతే పరిస్థితిని బట్టి అంచనాకు వస్తావా..?

సూర్య: టీ20 ఫార్మాట్‌లో ముందే కొంచెం అంచనా వేయాలి. అదే సమయంలో ఇతర షాట్లను ఆడాలి. అలాగే బౌలర్‌ ఎలా వేస్తాడు అనేదానిని కాస్త ముందుగా గ్రహించి షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తా. మూడో టీ20 మ్యాచ్‌లో వెనుకవైపు బౌండరీ లైన్‌ తక్కువగా ఉందనిపించింది. అందుకే అటువైపు బంతిని పంపించేందుకు షాట్లు కొట్టా. ఎక్కువగా ఫీల్డర్ల మధ్య ఖాళీ ప్రాంతాలను గుర్తించి కొడతా. ఫీల్డింగ్‌ను బట్టి కాస్త అడ్వాంటేజ్ తీసుకొంటా.

ద్రవిడ్‌: ప్రాక్టీస్‌ సమయంలో గమనిస్తూ ఉంటాం. అయితే సాధన చేసేటప్పుడు ఇలాంటి షాట్లు కొట్టడం నేను చూడలేదు (నవ్వుతూ). కేవలం డిఫెన్స్‌, స్ట్రైట్‌డ్రైవ్‌.. ఇలా చేసేవాడివి. ఇంకెలా సిద్ధమయ్యేవాడివి..?

సూర్య: అవును. నేను ట్రైనింగ్‌, ప్రాక్టీస్‌ చేసేటప్పుడు కేవలం బ్యాట్‌ బంతి టచ్‌ అయినప్పుడు వచ్చే శబ్దంపైనే దృష్టిపెట్టేవాడిని. బ్యాట్‌ మిడిల్ అవుతుందా... లేదా..? అనేదానిపై సాధన చేస్తా. లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్, ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో బాగా ప్రాక్టీస్‌ చేశానని అనిపిస్తే ఆ రోజు ఎంతో సంతోషిస్తా. 

ద్రవిడ్‌: దేశవాళీ క్రికెట్‌లో చాలా సంవత్సరాలు ఆడిన యువకులు, ఎదుగుతున్న కుర్రాళ్లకు భారత్‌ జట్టులోకి రావాలంటే సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారు వస్తే అక్కడితో విజయవంతమైనట్లు భావిస్తుంటారు. మరి నువ్వు సక్సెస్‌ అయినట్లు అనుకుంటున్నావా..? లేకపోతే పరుగుల దాహం ఉందా.?

సూర్య: నేను చాలా ఏళ్లు డొమిస్టిక్‌ క్రికెట్ ఆడాను. అయితే నాకు ఇప్పటికీ పరుగులు చేయాలనే తపన మాత్రం తగ్గలేదు. ముంబయి తరఫున ఆడేటప్పుడు చాలా సంతోషించా. గత రెండేళ్లుగా అయితే ఆటను మరింత ఎంజాయ్‌ చేస్తున్నా. 

ద్రవిడ్‌: నువ్వు ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం మీ భార్య, కుటుంబం అని తెలుసు. మరీ ముఖ్యంగా డైట్‌, ఫిట్‌నెస్‌ విషయంలో నీ సతీమణిదే ముఖ్యపాత్ర కదా..  రెండేళ్ల కిందట ఇండియా -ఏ, ఎన్‌సీఏ, యో-యో టెస్టులో పాస్ కావడం జరిగింది. దీనికంతటికి కారణం ఎవరని భావిస్తున్నావు? 

సూర్య: యువ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో పెద్దగా ఎవరూ సహకరించలేదు. మా నాన్న ఇంజినీర్‌. మాకు ఎలాంటి క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఆయనే నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దాని కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కుటుంబం నుంచి మంచి సహకారం ఉంది. మరీ ముఖ్యంగా పెళ్లైన తర్వాత నా భార్య డైట్‌, ఫిట్‌నెస్‌‌కు సంబంధించి మద్దతుగా నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని