Updated : 21 Feb 2022 11:31 IST

Dravid - Saha: సాహా వ్యాఖ్యలకు బాధపడటం లేదు.. రాహుల్‌ ద్రవిడ్‌ వివరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలకు బాధపడటం లేదని హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. వచ్చేనెల శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు శనివారం భారత జట్టును ఎంపిక చేయగా అందులో అతడితో పాటు పలువురు సీనియర్‌ ఆటగాళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన సాహా.. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ద్రవిడ్‌ తనను రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని సూచించినట్లు పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారగా ద్రవిడ్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.

‘సాహా మాటలతో నేను అస్సలు బాధపడటం లేదు. టీమ్ఇండియాకు అతడు ఏం సాధించాడో, ఎలాంటి సేవలు చేశాడో వాటి పట్ల పూర్తి గౌరవం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాల మీద అతడికి స్పష్టత ఉండాలనే కోణంలోనే మా మధ్య చర్చ జరిగింది. అలాగే నేను ఇలాంటి మాటలు అందరి ఆటగాళ్లకూ చెబుతుంటాను. కానీ, నేను చెప్పే ప్రతి విషయం ఆటగాళ్లు అంగీకరించాలని ఆశపడను. క్రికెట్‌లో సున్నితంగా ఉంటే సరిపోదు. ఒక్కోసారి వాళ్లతో ఇలాంటి కఠినతరమైన విషయాలు చర్చకు వస్తాయి. అంతేకానీ, ఆటగాళ్లతో మాట్లాడకుండా సమస్యలను అలాగే కప్పిపుచ్చాలనుకోవడం సరికాదు. నేనెప్పుడూ జట్టును ఎంపిక చేసేముందు ఆటగాళ్లతో ఇలాంటి చర్చలే జరుపుతాను. అలాగే ఆయా ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదనే విషయంలోనూ స్పష్టత ఇస్తా. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు నిరాశకు గురై మనస్తాపం చెందటం సహజమే’ అని ద్రవిడ్‌ స్పందించాడు.

సాహాతో ఏం చెప్పానంటే..

‘ఇప్పటికే టీమ్‌ఇండియాలో రిషభ్‌ పంత్‌ నంబర్‌ 1 వికెట్‌ కీపర్‌గా నిరూపించుకున్నాడనే విషయాన్ని సాహాతో చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే జట్టు యాజమాన్యం కూడా రెండో వికెట్‌ కీపర్‌గా యువకులకు (కేఎస్‌ భరత్‌) ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన చేసినట్లు వివరించాను. అంతమాత్రాన సాహా అంటే నాకు చిన్నచూపు కాదు. అతడి పట్ల గౌరవం లేదని కాదు. అయితే, ఇలాంటి విషయాల పట్ల ఆటగాళ్లతో మాట్లాడకుండా మౌనంగా ఉండటమే నాకు తేలికైన విషయం. కానీ, నేను అలాంటి వ్యక్తిని కాదు. కొంతకాలం తర్వాతైనా వారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని టీమ్‌ఇండియా కోచ్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని