Rahul Dravid: నేనిప్పుడు ప్లేయర్‌ కాదుగా.. గతం ఇప్పుడెందుకు?: రాహుల్ ద్రవిడ్

భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కిదే చివరి టీ20 ప్రపంచకప్‌. ఇప్పుడు టీమ్‌ఇండియా సూపర్-8 పోరుకు వచ్చేసింది.

Published : 20 Jun 2024 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌ సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈసందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ అసహనం వ్యక్తంచేశాడు. ఆటగాడిగా విండీస్‌లో గొప్ప గణాంకాలు లేవని.. ఇప్పుడు ఏం చేస్తారని ద్రవిడ్‌ ఎదుట ఓ ప్రశ్నను ఉంచాడు. తాను ప్రధాన కోచ్‌గా మాత్రమే ఆలోచిస్తానని.. గతం గురించి పట్టించుకోనని రాహుల్ సూటిగా సమాధానం ఇచ్చాడు. 

రిపోర్టర్: రాహుల్, మీరు ప్లేయర్‌గా విండీస్‌లో ఆడారు. అయితే, 1997లోని టెస్టు సందర్భంగా మీకు మంచి అనుభవాలు లేనట్లుంది?

ద్రవిడ్‌: ఇలాంటి సమయంలో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఇక్కడ ఇతర మంచి జ్ఞాపకాలూ ఉన్నాయి. 

రిపోర్టర్: అదే నా అసలైన ప్రశ్న. గతంలోకంటే మెరుగైన జ్ఞాపకాలను అందుకోవడానికి ఇప్పుడు మీ ముందు ఓ మంచి అవకాశం ఉంది. దానిని సాధిస్తారా? 

ద్రవిడ్‌: ఇప్పుడు నేను కొత్తగా చేయడం లేదు. జట్టు విజయంపైనే దృష్టిపెట్టాం. గతం గురించి ఇప్పుడు అవసరం లేదు.

రాహుల్ ద్రవిడ్ 1997లో విండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడాడు. ఇదే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో 78, 2 పరుగులు చేసినా భారత్‌ మాత్రం ఓటమిపాలైంది. ఇప్పుడు అదే విషయాన్ని ఆ రిపోర్టర్‌ భారత కోచ్‌ ఎదుట ప్రస్తావించాడు. దాదాపు పాతికేళ్ల కిందట ఆడిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై ఇప్పుడేమీ ఆలోచించడం లేదని ద్రవిడ్ స్పష్టంచేశాడు. 

ఇప్పుడు ఏంటనేదే ముఖ్యం

‘‘ఎప్పుడో జరిగిన వాటినుంచి నేను త్వరగా బయటకొచ్చేస్తా. వెనక్కి తిరిగి వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోను. ఇప్పుడు ఏం చేయాలి? అనేదానిపైనే దృష్టిపెడతా. 97లో జరిగిన దాని గురించి నాకేమీ ఆందోళన లేదు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే వేరేరకంగా మాట్లాడేవారు. ఆ ఇన్నింగ్స్‌ వల్లే గెలిచామని చెప్పేవాళ్లు. ఇక వరల్డ్‌ కప్‌లో అఫ్గాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు మా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా, ఇప్పుడు నేను ప్లేయర్‌గా రాలేదు. కాబట్టి పాత వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని