Gill: అప్పుడు మీ నాన్న అలా అనుంటారు కదా.. గిల్‌తో ద్రవిడ్‌ సరదా సంభాషణ

 భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ ముగిసిన అనంతరం యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ను భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.

Published : 25 Jan 2023 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ కివీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. గతంలో అతడు భారీ స్కోరు నమోదు చేయనప్పుడు అతడి తండ్రి ఏవిధంగా స్పందించి ఉంటాడో ఊహించినట్టు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. చిరుజల్లులనే చూపిస్తావా..? ఉరుములు, మెరుపులతో వర్షాన్ని కురిపించవా..? అంటూ గిల్‌ను అతడి తండ్రి ప్రోత్సహించి ఉండొచ్చన్నాడు. 

భారత్ - న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్‌ గిల్‌ను భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసించాడు. మ్యాచ్‌ అనంతరం గిల్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది.  ప్రస్తుతం గిల్‌ ప్రదర్శన చూసి అతడి తండ్రి గర్వపడుతుంటాడని ద్రవిడ్‌ తెలిపాడు.‘‘శుభ్‌మన్‌ అర్ధశతకాలు సాధించినప్పటికీ వాటిని శతకాలుగా మార్చని సమయంలో అతడి తండ్రి..‘శుభ్‌మన్‌ నువ్వు మాకు చిరుజల్లులనే చూపిస్తావా? ఉరుములు, మెరుపులతో వర్షాన్ని కురిపించవా?’ అని ప్రోత్సహించి ఉంటాడు. గిల్‌ నువ్వు నిజంగా వర్షాన్ని కురిపించావు. మీ నాన్న నిన్ను చూసి గర్వపడుతుంటారు’’ అని ప్రశంసించాడు.

గిల్‌ మాట్లాడుతూ..‘‘ఈ ఇన్నింగ్స్‌తో (112) ఆయన ఎక్కువగా సంతోషపడతారని నేను అనుకోవట్లేదు. ఈ మ్యాచ్‌లో నేను ఇంకా కొనసాగి ఉండాల్సిందని ఆయన నాకు కచ్చితంగా చెబుతారు. క్రీజ్‌లో ఇంకాసేపు ఉంటే మరో భారీ స్కోర్‌ చేయడానికి ప్రయత్నించేవాడిని’’ అని వెల్లడించాడు. గిల్‌ మాటలకు ద్రవిడ్‌ స్పందిస్తూ..‘‘మేము నిన్ను ప్రోత్సహించకపోయినా మీ నాన్న తప్పకుండా ప్రోత్సహిస్తారు. నీకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి’’ అని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని