Virat - Dravid: నన్ను 16 నెలలు వెయిట్‌ చేయించావు.. విరాట్ కోహ్లీతో రాహుల్‌ ద్రవిడ్‌

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ నిరీక్షణకు తెరపడింది. తొలుత టీ20.. ఆ తర్వాత వన్డేల్లో... తాజాగా టెస్టుల్లోనూ సెంచరీ బాదేసి భారం మొత్తం దించేసుకున్నాడు.

Updated : 15 Mar 2023 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు మూడున్నరేళ్ల తర్వాత  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) టెస్టు సెంచరీ సాధించాడు. 2019 నుంచి గతేడాది ఆసియా కప్‌ వరకు (2022) ఏ ఫార్మాట్‌లోనూ శతకం నమోదు చేయని విరాట్.. తొలుత టీ20లతో శతక జోరును ప్రారంభించి తాజాగా ఆసీస్‌పై  టెస్టు సెంచరీని కొట్టేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ ఖాతాలో 75 శతకాలు ఉన్నాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్‌లో 186 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీతో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా మాట్లాడాడు. 

డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి టెస్టు సెంచరీ చూసేందుకు దాదాపు 16 నెలలపాటు వేచి ఉండేలా  చేశావని విరాట్‌నుద్దేశించి ద్రవిడ్ అన్నాడు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘నేను కోచ్‌గా (2021 నవంబర్) వచ్చినప్పటి నుంచి నీ టెస్టు సెంచరీ కోసం ఎదురు చూస్తున్నా. అలా నన్ను 16 నెలల పాటు వేచి ఉండేలా చేశావు. అయితే, ఆసీస్‌పై నువ్వు ఆడిన ఈ ఇన్నింగ్స్‌ అద్భుతం’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. వెంటనే విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో స్పందించాడు. సెంచరీని తానూ ఎంతో ఆస్వాదించానని, ఇంతకుముందు కూడా ఇంతకంటే మంచి ఇన్నింగ్స్‌లే ఆడినట్లు చెప్పాడు. 

‘‘రాహుల్‌ భాయ్‌ ధన్యవాదాలు. ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించినంత వరకు ఆందోళనేం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు వరకు కూడా చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడా. అయితే, అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ, ఆసీస్‌ జట్టు మాత్రం నా కోసం ఫీల్డింగ్‌ సెటప్‌ను పెట్టింది. పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ మాత్రం కట్టుదిట్టంగా బంతులను సంధించారు. ఎక్కువ సమయం 7-2 ఫీల్డింగ్‌ను పెట్టారు. సర్కిల్‌ లోపల ఏడుగురు.. బౌండరీ లైన్‌లో కేవలం ఇద్దరిని మాత్రమే ఉంచారు. నా డిఫెన్స్‌ మీద నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. గతంలోనూ టెస్టు క్రికెట్‌లో ఇలానే ఆడా’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని