Rahul Dravid: నాకు రూ.5 కోట్లు వద్దు.. బోనస్‌పై రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!

భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ వచ్చాడు. అయితే, మొన్నటివరకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్‌ తీసుకున్న ఓ నిర్ణయం ప్రశంసలు అందించేలా చేస్తోంది.

Published : 10 Jul 2024 10:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్‌గా (Head Coach) పనిచేసిన రాహుల్ ద్రవిడ్ తన బోనస్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని కథనాలు వస్తున్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీని సాధించడంలో ద్రవిడ్‌ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) నెగ్గిన సంగతి తెలిసిందే. కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌ (Rahul Dravid) తన పదవీ కాలాన్ని ఘనంగా ముగించాడు. దీంతో బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా ప్రకటించి.. స్క్వాడ్‌లోని 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున అందించింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్‌కూ రూ.5 కోట్ల బోనస్‌ దక్కింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లను ఇచ్చింది. దీంతో రాహుల్ కూడా తన బోనస్‌ను సగానికి తగ్గించుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. అందరికీ సమానంగా బోనస్‌ అందించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.

‘‘ద్రవిడ్ కూడా తన సహాయ కోచింగ్‌ స్టాఫ్‌తో సమానంగానే బోనస్‌ను పంచుకోవాలనుకుంటున్నాడు. ద్రవిడ్‌కు బోనస్‌గా రూ.5 కోట్లు వచ్చాయి. కానీ, ఇతర కోచ్‌లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ (BCCI) అందించింది. దీంతో తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్‌ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. వారందరితోపాటు తనకూ బోనస్‌ను రూ.2.5 కోట్లు ఇవ్వాలని కోరాడు. అతడి సెంటిమెంట్‌ను మేం అర్థం చేసుకొని గౌరవిస్తాం’’ అని బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. 

అప్పుడూ అంతే.. 

2018లో అండర్-19 ప్రపంచ కప్‌ సాధించిన భారత జట్టును (Team India) ద్రవిడే నడిపించాడు. అతడి కోచింగ్‌లోనే టీమ్‌ఇండియా అద్భుతాలు సృష్టించింది. దీంతో ఆటగాళ్లకు, కోచింగ్‌ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్‌కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు, ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు చొప్పున అందించింది. కానీ, ద్రవిడ్‌ మాత్రం అందరితోపాటు తనకూ సమానంగా ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్‌ అవార్డులను బోర్డు రివైజ్‌ చేసి సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోవడంతో నెట్టింట అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని