Rahul Dravid: నేనెప్పటికీ సెహ్వాగ్‌లా ఉండలేను: రాహుల్‌ ద్రవిడ్

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తానెప్పటికీ మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా ఉండలేనని చెప్పాడు. తాజాగా అభినవ్‌ బింద్రాతో  ఓ పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్‌ తన ఆటకు సంబంధించి...

Updated : 26 Jul 2022 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తానెప్పటికీ మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా ఉండలేనని చెప్పాడు. తాజాగా అభినవ్‌ బింద్రాతో  ఓ పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్‌ తన ఆటకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆలోచనా విధానాన్ని క్రికెట్‌ నుంచి తప్పిస్తే మానసికంగా ఎలా ఉపయోగపడిందో వివరించాడు.

‘ఒక్కసారి నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. దీర్ఘకాలం నేను క్రికెట్‌లో కొనసాగడానికి, అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నేను మానసికంగా దృఢంగా ఉండటమే అసలైన కారణం. నేను క్రికెట్‌ ఆడనప్పుడు కూడా నా ఆట గురించి, ఎలా ఆడాలనే విషయాల గురించి అతిగా ఆలోచించేవాడిని. దీంతో నేను నా మానసిక శక్తిని అనవసరంగా వృథా చేసేవాడిని. అయితే, ఒకానొక సమయంలో అలా ఆలోచించడం వల్ల నాకు ఏమాత్రం ఉపయోగం లేదని గ్రహించా. అది నా ప్రదర్శనను కూడా మెరుగుపర్చడం లేదని గుర్తించా. దీంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించి రీఫ్రెష్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలోనే క్రికెట్‌కు మించిన కొత్త జీవితాన్ని కనుగొన్నా’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

అయితే, తానెప్పటికీ వీరూలా ఉండలేనని చెప్పాడు. ‘సెహ్వాగ్‌ తనకున్న వ్యక్తిత్వంతో క్రికెట్‌ నుంచి చాలా తేలిగ్గా తన దృష్టిని మరల్చుకోగలడు. నేనెప్పటికీ అతడి స్థాయికి చేరుకోలేను. కానీ, ఉన్నట్ట్టుండి నా కెరీర్‌లో ప్రమాద ఘంటికలను గుర్తించా. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి మానసికంగా దృఢంగా ఉండాలని గ్రహించా. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే సరిగ్గా ఆడలేం. ఆ విషయం నేను గుర్తించాక మరింత ఎక్కువగా దాని మీద దృష్టి సారించా. దీంతో అది నా కెరీర్‌కు బాగా ఉపయోగపడింది’ అని టీమ్‌ఇండియా కోచ్‌ వివరించాడు. కాగా, ద్రవిడ్‌ 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా పలు సందర్భాల్లో ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలోనే తనను తాను మార్చుకొని తిరిగి టీమ్‌ఇండియా తరఫున రాణించాడు. దీంతో చివరికి అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో అతి గొప్ప బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని