IND vs SA: జట్టు అలా ఉండటానికి కోహ్లీ నాయకత్వమే కారణం: రాహుల్‌ ద్రవిడ్‌

దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచూరియన్‌లో గురువారం ముగిసిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా.. అతిథ్య జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల

Updated : 02 Jan 2022 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచూరియన్‌లో గత గురువారం ముగిసిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా.. అతిథ్య జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ టెస్టులో భారత్ గెలుపొందడానికి కోహ్లీ నాయకత్వమే కారణమని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటంలో విరాట్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించాడు. ‘ఈ ప్రత్యేకమైన టెస్ట్ మ్యాచ్‌కి నాయకత్వం వహిస్తున్నప్పుడు చుట్టూ ఎంతో గందరగోళం పరిస్థితులు ఉన్నాయి. కానీ, అలాంటి సమయంలోనూ జట్టు సభ్యుల్లో ఉత్సాహం, మనోబలం తగ్గకుండా చూసుకోవడం అంతా తేలికైన పని కాదు. ఈ బాధ్యతలను కెప్టెనే స్వయంగా చూసుకోవాలి. విరాట్‌ కోహ్లీ గత 20 రోజులుగా అద్భుతంగా వ్యవరిస్తున్నాడు. అతను శిక్షణ పొందిన విధానం, జట్టు సభ్యులతో మమేకం కావడం వల్లే ప్రస్తుతం టీమ్‌ఇండియా ఈ స్థాయిలో ఉంది. కోహ్లీ అద్భుతమైన నాయకుడు. జట్టులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటానికి అతడి నాయకత్వం సహాయపడింది’ అని రెండో టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ అన్నాడు. 

‘ఇలాంటి (కోహ్లీ) వారితో కలిసి పనిచేయడం కష్టంగా ఉండదు. వ్యక్తిగతంగానూ కోహ్లీ ప్రశాంతంగా ఉంటాడు. అతడు బాగా బ్యాటింగ్ చేశాడు. కానీ, మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మరల్చలేకపోయాడు. త్వరలోనే అతడు భారీ స్కోర్లు చేస్తాడని భావిస్తున్నా’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. తొలి టెస్టులో విజయం సాధించి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టులోనూ సత్తాచాటి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాదు దక్షిణాఫ్రికా గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రేపటి నుంచి (జనవరి 3) జోహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని