Rahul Dravid: రాహుల్‌ను టెస్టులకే పరిమితం చేయాలి.. టీ20లకు వద్దు: డానిష్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లోనే వెనుదిరిగింది. జట్టు కూర్పు, నాయకత్వ లోపం, ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకొనేలా చేయడంలో కోచ్‌ విపలం కావడం వంటి కారణాలను చూపుతూ మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇదే క్రమంలో పాక్‌ మాజీ టాప్‌ స్పిన్నర్‌ డానిష్ కనేరియా కూడా టీమ్‌ఇండియా లోపాలను ప్రస్తావించాడు. 

Updated : 12 Nov 2022 18:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో పేలవమైన ఆటతీరుతో టీమ్‌ఇండియా క్రికెట్ జట్టు  విమర్శలు ఎదుర్కొంటోంది. గత రెండు దశాబ్దాల్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మాత్రమే  భారత్‌ ఒక వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌ సహా ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకొంది. ఇక ఆ తర్వాత ఐసీసీ మెగా టోర్నీల్లో చతికిలపడుతూ వచ్చిన భారత్‌ను విజయపథంలో నడిపిస్తారని  రాహుల్‌ ద్రవిడ్ - రోహిత్ శర్మ ద్వయం నుంచి ఆశించినా.. వారు ఘోరంగా విఫలం కావడంతో చర్చకు కేంద్ర బిందువుగా మారారు. అంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లోనూ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో రాహుల్‌ ద్రవిడ్‌ను కేవలం టెస్టు జట్టుకే కోచ్‌గా ఉంచాలని, టీ20 ఫార్మాట్‌కు వద్దని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సూచించాడు. 

‘‘ రిషభ్‌ పంత్‌ను తీసుకొనే ఉండుంటే తప్పకుండా అతడు టాప్‌ ఆర్డర్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌ వరకు ఉపయోగపడేవాడు. కానీ అలా జరగలేదు. అతడు చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. అందుకే టీమ్‌ఇండియా మైడ్‌సెట్‌ మారాలి. అలాగే రాహుల్‌ ద్రవిడ్ కూడా తన మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు ఫార్మాట్‌కు సూపర్. అందుకే అతడిని టెస్టులకే పరిమితం చేయాలి. టీ20లకు వేరొకరికి బాధ్యత అప్పగించాలి. పొట్టి ఫార్మాట్‌లో దూకుడు అనేది చాలా కీలకం. కానీ రాహుల్‌లో అది కనిపించలేదు. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అతడికి తెలియదు. ఎందుకంటే రోజంతా క్రీజ్‌లో ఉండగల సత్తా ఉన్న ద్రవిడ్ ‘కూల్‌ క్రికెటర్’. అయితే ఇది టీ20 ఫార్మాట్. తప్పకుండా ఒత్తిడిని తట్టుకొని పరుగులు సాధించాలి’’

‘‘టీ20 ప్రపంచకప్‌నకు ముందు రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన మరో పెద్ద తప్పిదం.. వేర్వేరు జట్లను తయారు చేసినప్పటికీ  సన్నద్ధత లేకపోకుండా బరిలోకి దిగడం. భారత టీ20 లీగ్‌లో రాణించిన  రాహుల్‌ తెవాతియా ఎక్కడ? అతడు ఉంటే పాక్‌లో షాదాబ్‌ ఖాన్‌లా ఆల్‌రౌండ్‌ పాత్ర పోషించేవాడు. బౌలింగ్‌తోపాటు లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగలడు. భారత్‌ బౌలింగ్‌ విభాగం కూడా చాలా బలహీనంగా ఉన్నా.. దాని కోసం ఏమీ చేయలేదు. ఆసీస్‌ పిచ్‌లకు మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి పేసర్లు కీలకంగా మారేవారు. ఆ ఇద్దర్ని తీసుకోలేదు. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ పేసర్లు కావాలి కానీ 120-130 వేగంతో బంతులు వేసేవారు కాదు. ఇకనైనా 2024 సీజన్‌ కోసం యువకులను తయారు చేయాల్సిన బాధ్యత టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌పై ఉంది’’ అని విశ్లేషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని