Rahul Tewatia: ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుంది: రాహుల్‌ తెవాతియా

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై గుజరాత్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాతియా విచారం వ్యక్తం చేశాడు. ఆశలు పెట్టుకుంటే నిరాశే...

Published : 17 Jun 2022 02:29 IST

(Photo: Rahul Tewatia Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై గుజరాత్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాతియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుందని భావోద్వేగం చెందాడు. ఈ నెల 26, 28 తేదీల్లో హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. అందుకోసం బుధవారం భారత సెలెక్టర్లు 17 మంది ఆటగాళ్ల బృందాన్ని ఎంపిక చేశారు. అయితే, అందులో తెవాతియాకు చోటు దక్కలేదు. దీంతో అతడు ట్విటర్‌ వేదికగా తన బాధను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

కాగా, తెవాతియా గతేడాది వరకు భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడగా.. ఈ సారి మెగా వేలంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ అతడిని కొనుగోలు చేసింది. ఆ జట్టు తరఫున తెవాతియా పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆడిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ ఛాంపియన్‌గా నిలవడంలో తనవంతు కృషి చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 217 పరుగులు చేశాడు. 147.61 అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌ సాధించడం విశేషం.

కాగా.. తెవాతియాకు 2020లోనే ఆస్ట్రేలియా పర్యటనకు అవకాశం వచ్చింది. అప్పుడు సెలెక్టర్లు టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినా ఫిట్‌నెస్‌ పరీక్షల్లో విఫలమయ్యాడు. అప్పటి నుంచీ మళ్లీ టీమ్ఇండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న అతడు ఈసారి కచ్చితంగా ఎంపిక చేస్తారనే ఆశతో ఉన్నాడు. కానీ, ఇప్పుడు కూడా సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టారు. దీంతో అభిమానులు తెవాతియాకు అండగా నిలిచారు. ఏదో ఒకరోజు కచ్చితంగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున రాణించిన రాహుల్‌ త్రిపాఠికి చోటు దక్కిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని