Rahul Tripathi: నా కష్టానికి ప్రతిఫలం దక్కింది: రాహుల్‌ త్రిపాఠి

ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా ఆడే రెండు టీ20ల సిరీస్‌కు రాహుల్‌ త్రిపాఠిని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. బుధవారం ఈ పర్యటనకు సంబంధించి ప్రకటించిన జట్టులో...

Published : 16 Jun 2022 10:54 IST

(Photo: Rahul Tripathi Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా ఆడే రెండు టీ20ల సిరీస్‌లకు ఎంపిక చేయడంపై రాహుల్‌ త్రిపాఠి హర్షం వ్యక్తం చేశాడు. బుధవారం ఈ పర్యటనకు సంబంధించి ప్రకటించిన జట్టులో త్రిపాఠి స్థానం దక్కించుకొన్న సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని యువ ఆటగాళ్ల బృందం ఈనెల 26, 28 తేదీల్లో రెండు పొట్టి మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున మెరవడంతో రాహుల్‌ను ఈ పర్యటనకు ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంపై రాహుల్‌ స్పందించాడు. ‘ఇది నాకు చాలా పెద్ద అవకాశం. కల నిజమైన వేళ. భారత జట్టుకు ఎంపికైనందుకు అమితానందంగా ఉంది. సెలెక్టర్లు నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. వారితో పాటు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటా. టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ క్రికెట్‌ ఆడటానికి ప్రయత్నిస్తా’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, 2017లో తొలిసారి రైజింగ్‌ పుణె జట్టు తరఫున భారత టీ20లీగ్‌లో మెరిసిన అతడు తర్వాత కోల్‌కతా జట్టులో నాలుగేళ్లు ఆడాడు. ఈసారి వేలంలో హైదరాబాద్‌ కొనుగోలు చేయడంతో ఆ జట్టులో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.  ఈసారి టోర్నీలో 413 పరుగులు చేసి మంచి ప్రదర్శన చేయడంతో ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, అతడిని ఎంపిక చేయకపోయేసరికి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సెలెక్టర్లను తీవ్రంగా దుయ్యబట్టారు. మరోవైపు రాహుల్‌ దేశవాళీ క్రికెట్‌లోనూ మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికచేశారు. మరి తుది జట్టులో రాహుల్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని