Rahul Tripathi: రాహుల్‌ గురించి మూడేళ్ల క్రితం షారుఖ్‌ మాట... ఇప్పుడు వైరల్‌..

సన్‌రైజర్స్‌ (sunrisers hyderabad) ఈ ఐపీఎల్‌(IPL 2023)లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో రాహుల్‌ త్రిపాఠి (rahul tripathi) అద్భుత ఇన్నింగ్స్‌ ఎంతో కీలకం.

Updated : 10 Apr 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదివారం ఐపీఎల్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌ ప్రదర్శనలు చూశాం. అందులో హైలైట్‌ అంటే రింకు సింగ్‌ అని చెప్పాలి. అది కాకుండా బాగా గుర్తుండిపోయే ఆట రాహుల్‌ త్రిపాఠి (Rahul Tripathi)ది. పంజాబ్‌పై సూపర్‌ అర్ధశతకం (74*) చేసి టోర్నీలో జట్టుకు తొలి విజయం అందించాడు. దీంతో ఇప్పుడు SRH అభిమానుల ట్విటర్‌ పేజీల్లో ఆ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం షారుఖ్‌ ఖాన్‌ చేసిన ఓ కామెంట్‌ కూడా కనిపిస్తోంది. అప్పుడు రాహుల్‌.. షారుఖ్‌ టీమ్‌లో ఆడేవాడులెండి. ఓసారి త్రిపాఠి ఇలాగే బాగా ఆడినప్పుడు మెచ్చుకుంటూ ఓ ట్వీట్‌ చేశాడు షారుఖ్‌.

అది 2020... రాహుల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అలా జట్టు విజయంలో కీలకంగా నిలిచిన రాహుల్‌ను జట్టు సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ (shah rukh khan) తెగ పొగిడేశాడు. ఆ వీరోచిత ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘రాహుల్‌.. ఈ పేరు ఇంతకుముందే ఎక్కడో విన్నాను. అతడి ఆట అంతకంటే గొప్పగా ఉంది’ అని మెచ్చుకున్నాడు. ఆ డైలాగ్‌ చెప్పడానికి స్ఫూర్తి అతని సినిమానే కావడం గమనార్హం.

షారుఖ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘దిల్‌తో పాగల్‌ హై’లో హీరో పేరు రాహులే. అందులో ‘రాహుల్‌.. నామ్‌ తో సునా హోగా’ అనే డైలాగ్‌ ఎంతో పాపులర్‌ అనే విషయం తెలిసిందే. ఆ రోజు షారుఖ్‌ ఆ మాట ఎందుకు అన్నాడో కానీ.. ఆదివారం సన్‌రైజర్స్‌ (sunrisers hyderabad), పంజాబ్‌ (punjab kings) మ్యాచ్‌లో ఆ పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మూడేళ్ల తర్వాత ఇలా జరుగుతుందని బాలీవుడ్‌ బాద్‌షా అప్పుడే ఊహించాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు.

తడబడినా.. అదుర్స్‌ అనిపించాడు

మరోవైపు ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్‌ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టుకు.. ఈసారి రాహుల్‌ త్రిపాఠి అద్భుత ఇన్నింగ్స్‌, మయాంక్‌ మార్కండే స్పిన్‌ మాయాజాలం తోడైంది. దీంతో పంజాబ్‌ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. లక్ష్యం చిన్నదే అయినా గత మ్యాచ్‌ల్లో ఆ జట్టు బ్యాటింగ్‌ సరళిని పరిశీలిస్తే  విజయంపై పెద్దగా ఎవరికీ నమ్మకం లేదు. అయితే.. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రాహుల్‌ త్రిపాఠి (74 నాటౌట్‌; 48 బంతుల్లో 10×4, 3×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత కాసేపు ఇబ్బందిపడ్డట్లు కనిపించినా.. కుదురుకున్నాక కెప్టెన్‌ మార్‌క్రమ్‌తో కలిసి అలవోకగా షాట్లు ఆడాడు. హైదరాబాద్‌కు అత్యవసరమైన  విజయాన్ని అందించి.. అందరి దృష్టిలో పడ్డాడు.

తొలి సీజన్‌లోనే.. చెలరేగి..

బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే రాహుల్‌ త్రిపాఠి.. 2017లో ఐపీఎల్‌లో పుణె తరఫున అరంగేట్రం చేశాడు. తొలి సీజన్‌లోనే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(93) నమోదు చేసి తన సత్తా ఎంటో చాటాడు. ఇక 2018, 2019ల్లో రాజస్థాన్‌కు మారాడు. అయితే.. అంతగా రాణించలేదు. 2020 ఐపీఎల్‌లో అతడిని కోల్‌కతా రూ.60 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. 2021లో టాప్‌ ఆర్డర్‌లో రాణిస్తూ.. మొత్తం 397 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ దళంలో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. గతేడాది 14 మ్యాచ్‌లు ఆడి మొత్తం 413 పరుగులు చేశాడు. ప్రతి సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. విలువైన ఆటగాడిగా మారాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 79 మ్యాచ్‌లు ఆడి.. 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ద శతకాలు ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని