Published : 09 Feb 2022 01:41 IST

IND vs WI : ఆధిక్యం కోసం భారత్‌ పోరాటం.. సమం చేసేందుకు విండీస్‌ యత్నం.!

ఇంటర్నెట్ డెస్క్‌ : కొత్త కెప్టెన్‌ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన చారిత్రక 1,000 వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు మంచి జోష్‌ మీద ఉంది. అదే జోష్‌తో రెండో వన్డేలోనూ పై చేయి సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరో వైపు తొలి వన్డేలో పరాజయం పాలైన వెస్టిండీస్‌.. రెండో వన్డేలో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బుధవారం (ఫిబ్రవరి 9న) జరుగనున్న మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.!

* రాహుల్‌ స్థానంపై సందిగ్ధం..

గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్‌ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండటం టీమ్ఇండియాకు సానుకూలాంశం. రెండో వన్డేకి వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ కూడా క్వారంటెయిన్‌ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అందుబాటులోకి రావడంతో టీమిండియా మరింత బలోపేతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, తుది జట్టులో ఎవరికి చోటివ్వాలనే విషయంపై కొంత గందరగోళం నెలకొంది. తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన యువ ఆటగాడు ఇశాన్ కిషన్‌ (28: 36 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. ఒక వేళ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే.. ఇశాన్‌కి జట్టులో చోటు దక్కడం కష్టమే. రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తే.. అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడాను పక్కన పెట్టే అవకాశం ఉంది. తొలి వన్డేలో దీపక్‌ (26 నాటౌట్‌: 32 బంతుల్లో 2×4) రాణించాడు.

* విరాట్‌ రాణించాలి..

సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ స్థానానికి ఎలాంటి ఢోకాలేదు. అయినా, చాలా రోజులుగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న విరాట్‌.. రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే, ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న శతక దాహాన్ని ఈ మ్యాచ్‌లోనైనా తీర్చుకుంటాడేమో చూడాలి. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

* కుల్దీప్‌ యాదవ్‌కి చోటు కష్టమే.!

మరో వైపు, స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్ (4/49)‌, వాషింగ్టన్‌ సుందర్‌ (3/30) తొలి వన్డేల్లో అదరగొట్టారు. కాబట్టి, వీరిద్దరినీ పక్కన పెట్టడం అసాధ్యం. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న మరో స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దొరకడం కష్టమే. అలాగే, పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ (2/29), కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించిన మహమ్మద్ సిరాజ్‌లను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి, బౌలింగ్‌ విభాగంలో దాదాపు మార్పులు లేనట్టే.

* విండీస్ సమష్టిగా రాణిస్తేనే..

గత కొద్ది కాలంగా వెస్టిండీస్ జట్టు నిలకడగా రాణించలేకపోతోంది. విండీస్‌ ఆడిన గత 16 వన్డేల్లో.. 10 మ్యాచుల్లో ఆఖరు వరకు బ్యాటింగ్‌ చేయలేకపోయింది. ఆ జట్టు అన్ని విభాగాల్లో మెరుగు పడాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో సమూల మార్పులు అవసరం. తొలి వన్డేలో ఆల్‌ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ (57: 71 బంతుల్లో 4×6) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ (2/45) ఫర్వాలేదనిపించాడు. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలను పెవిలియన్‌కి పంపించాడు. భారత్‌కి పోటీనివ్వాలంటే రెండో వన్డేలో బ్యాటర్లు నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌ రాణించాల్సిన అవసరం ఉంది. 

తుది జట్ల అంచనా :

భారత్ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

వెస్టిండీస్ : బ్రెండన్‌ కింగ్‌, శాయి హోప్ (వికెట్‌ కీపర్‌), డారెన్‌ బ్రావో, బ్రూక్స్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), జేసన్‌ హోల్డర్, ఫేబియన్‌ అలెన్‌, అకీల్ హోసెయిన్‌, అల్జారీ జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని