Raj Bawa: యువరాజ్‌ వీడియోలు చూసి బ్యాటింగ్‌ అనుసరించేవాడిని: రాజ్‌ బవా

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌, అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో రాజ్‌ బవా తనకు...

Published : 07 Feb 2022 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌, అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో రాజ్‌ బవా తనకు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అంటే ఇష్టమని చెప్పాడు. ఆ మాజీ ఛాంపియన్‌ తన రోల్‌ మోడల్‌ అని పేర్కొన్నాడు. తాజాగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఈ పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ ఇంగ్లాండ్‌పై (5/31) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బవా.. ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమ్‌ఇండియా తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అతడు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి యువీని చూస్తూ పెరిగానని చెప్పాడు.

‘మా నాన్న సుఖ్‌విందర్‌ యువరాజ్‌ సింగ్‌కు శిక్షణ ఇచ్చాడు. దాంతో చిన్నప్పటి నుంచే అతడిని చూస్తూ పెరిగాను. అలాగే నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడి మాదిరే బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుసరించేవాడిని. అతడి బ్యాటింగ్‌ వీడియోలు చూస్తూ పెరిగాను. దాంతో నాకు యువీ రోల్‌ మోడల్‌గా నిలిచాడు’అని బవా తాజాగా వివరించాడు. మరోవైపు ఈ యువ క్రికెటర్‌ యువీని చూసే లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేసేవాడని సుఖ్‌విందర్‌ పేర్కొన్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కుడి చేతితో చేసినా బ్యాటింగ్‌ మాత్రం ఎడమ చేతివాటంతో ఆడేవాడని ఆయన వివరించారు. అలాగే తన కుమారుడిని నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా చూడాలనుకున్నట్లు చెప్పారు. యువీలా బ్యాటింగ్‌ చేయడంతో పాటు కపిల్‌లా బౌలింగ్‌ కూడా చేస్తే బాగుంటుందని ఆశించినట్లు సుఖ్‌విందర్‌ తన కోరికను వెలిబుచ్చాడు. కాగా, ఈ తండ్రీ కుమారులిద్దరూ.. 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టులో గోల్డ్‌మెడల్‌ సాధించిన తర్లోచాన్‌ సింగ్‌ బవా కుమారుడు, మనువడు కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని