Rajasthan vs Chennai: రాజస్థాన్‌ రెండులోనా.. మూడులోనా.. ఈ రోజు తేలుతుంది!

సంజూ శాంసన్‌ కెప్టెన్సీ, జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో రాజస్థాన్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆకట్టుకుంది...

Updated : 20 May 2022 15:08 IST

(Photos: Dhoni, Sanju Samson Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌:  టీ20 లీగ్‌లో మొదటి రెండు స్థానాలకు ఉన్న క్రేజ్‌ వేరు. ఎందుకంటే తొలి క్వాలిఫయర్‌లో ఓడిపోయినా.. ఫైనల్‌కి చేరడానికి మరో అవకాశం ఉంటుంది. ఈ ఏడాది గుజరాత్‌ తొలి స్థానం పక్కా చేసుకుంది. దీంతో రెండో స్థానం కోసం పోటీ కొనసాగుతోంది. ఆ నెంబర్‌ 2 ఎవరనేది ఈ రోజు మ్యాచ్‌తో తేలిపోతుంది. ఈ రోజు చెన్నైతో రాజస్థాన్‌ మ్యాచ్‌ రెండో స్థానాన్ని నిర్ణయిస్తుంది. 

రాజస్థాన్‌ ఇప్పుడేంటి..

ఈ సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్‌, లఖ్‌నవూ జట్లు లీగ్‌ స్టేజ్‌లో తమ 14 మ్యాచ్‌ల కోటా పూర్తయ్యేసరికే 20, 18 పాయింట్లతో టాప్‌-1, 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఆ తర్వాత రాజస్థాన్‌ 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు ఒక మ్యాచ్‌ ఆడాల్సి ఉండటంతో.. చివరికి లఖ్‌నవూను వెనక్కినెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. దానికి కారణం.. రాజస్థాన్‌ రన్‌రేట్‌ (0.304).. లఖ్‌నవూ (0.251) కన్నా మెరుగ్గా ఉండటమే. అలాంటప్పుడు చెన్నైతో జరిగే మ్యాచ్‌లో సంజూ టీమ్‌ గెలిస్తే రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అదే జరిగితే ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌కు చేరడానికి ఇంకా అవకాశాలు ఉంటాయి.

చెన్నైని ఓడిస్తుందా..

ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ధోనీ సేన ఈ రోజు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు నాలుగు విజయాలే సాధించి 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో తమ చివరి మ్యాచ్‌లో గెలుపొంది గౌరవప్రదంగా తిరిగి వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అలాంటప్పుడు రాజస్థాన్.. చెన్నైను ఎలా ఓడిస్తుందో చూడాలి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరు జట్ల బలాబలాలు పరిశీలిస్తే సంజూ టీమ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బట్లర్‌, సంజూలపైనే ఆశలు..

రాజస్థాన్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్ (627) తప్ప ఈ సీజన్‌లో అంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కనిపించడం లేదు. కెప్టెన్‌ శాంసన్‌ (359) మోస్తరుగా పరుగులు చేస్తున్నాడు. అతడు పెద్దగా ప్రభావం చూపే ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. ఇక మిగిలిన వారిలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (334), యశస్వి జైశ్వాల్‌ (153), రవిచంద్రన్‌ అశ్విన్‌ (143) లాంటి ఆటగాళ్లు అప్పుడప్పుడు మెరుస్తున్నారు. దీంతో చెన్నై మొత్తంగా బట్లర్‌, శాంసన్‌, పడిక్కల్‌ను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తే సగం పని పూర్తయినట్లే. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (24) ఒక్కడే వికెట్ల రూపంలో మెరుస్తున్నాడు. పేసర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ (15), ట్రెంట్‌ బౌల్ట్‌ (12) ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అంత ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (10) పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నా వికెట్ల పరంగా వెనుకపడ్డాడు.

చెన్నై ఎలా ఉంది?

చెన్నై విషయానికొస్తే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (366), డెవాన్‌ కాన్వే (236) ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ మరోసారి శుభారంభం చేస్తే చెన్నైకు తిరుగుండదు. ఆపై వచ్చే శివమ్‌ దూబే (289), అంబటి రాయుడు (271), రాబిన్‌ ఉతప్ప (230) అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ (206) ఈ మధ్య జట్టు అవసరాలకు తగ్గట్టు రాణిస్తున్నాడు. కొన్నిసార్లు ముందుగానే బ్యాటింగ్‌కు వస్తుండగా మరికొన్ని సార్లు ఫినిషర్‌గా వస్తున్నాడు. దీంతో రాజస్థాన్‌ బౌలర్లు సైతం చెన్నై ఓపెనర్లను కట్టడి చేసి ఆఖర్లో ధోనీని నిలువరిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో (16), ముఖేశ్‌ చౌదరి (16) వికెట్లతో ఫర్వాలేదనిపిస్తున్నా పరుగుల్ని నియంత్రించలేకపోతున్నారు. ఆపై మహేశ్‌ తీక్షణ (12) వికెట్లతో పాటు కాస్త పొదుపుగా ఆకట్టుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని