Shane Warne : షేన్‌వార్న్‌.. నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు: రాజస్థాన్‌

అరంగేట్ర దేశవాళీ టీ20 లీగ్‌లో కప్‌ను అందించిన క్రికెట్‌ దిగ్గజం...

Published : 30 Mar 2022 12:06 IST

ముంబయి : తొలి టీ20 లీగ్‌లో కప్‌ను అందించిన క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌కు రాజస్థాన్‌ ఘన నివాళి అర్పించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు డగౌట్‌లో షేన్‌వార్న్‌ పోస్టర్‌ ఉన్న ఫొటోను రాజస్థాన్‌ జట్టు సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘మేం ఎక్కడికి వెళ్లినా మీరు మాతోనే’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. స్టేడియంలోనూ అభిమానులు షేన్‌వార్న్‌ను తలుచుకుంటూ ప్రదర్శించిన ప్లకార్డును రాజస్థాన్‌ పోస్టు చేసింది.

అప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన షేన్‌వార్న్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ తొలి టీ20 లీగ్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం (11 విజయాలతో) సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్‌లో దిల్లీని చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 192/9 భారీ స్కోరు చేసింది. అనంతరం దిల్లీని 87 పరుగులకే కుప్పకూల్చింది. ఈ విజయంలో షేన్‌వార్న్ (2/21) కీలక పాత్ర పోషించాడు. తుదిపోరులో చెన్నైను ఢీకొట్టి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్‌లో చెన్నై 163/5 స్కోరు చేయగా.. రాజస్థాన్‌ సరిగ్గా 20 ఓవర్లకు 164/7 చేసి విజయం సాధించడం విశేషం. షేన్‌వార్న్‌ (9*) నాటౌట్‌గా నిలిచి తమ జట్టుకు కప్‌ అందించాడు. 143/7తో కష్టాల్లో ఉన్న రాజస్థాన్‌ను సోహైల్‌ తన్వీర్‌ (9*)తో కలిసి విజయతీరాలకు చేర్చాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని