Rajasthan Royals : రాజస్థాన్‌ రాయల్స్ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా మళ్లీ అతడే..

మార్చి 26 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌  ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో...

Published : 04 Mar 2022 23:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : మార్చి 26 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు సిబ్బందిని నియమించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా యూకేకి చెందిన స్టెఫెన్ జోన్స్‌ను నియమించింది. 48 ఏళ్ల స్టెఫెన్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ల తరఫున ఆడాడు. ఫాస్ట్‌ బౌలర్‌ అయిన స్టెఫెన్‌ను 2019 సీజన్‌లో రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా తీసుకుంది. ఇప్పుడు మరోసారి బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు జోన్స్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా అపాయింట్ చేసింది. ‘‘ఏడాది పొడవునా మా బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు జోన్స్‌ను తీసుకున్నాం. ఐపీఎల్‌ సీజన్‌లోనే కాకుండా మిగతా సమయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తాడు’’ అని ఆర్‌ఆర్‌ ప్రకటన విడుదల చేసింది. నాగ్‌పుర్‌ వేదికగా మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే ప్రీ సీజన్‌ క్యాంప్‌లో జోన్స్‌ టీమ్‌తో చేరతాడు. 

‘‘రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీకి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్ వారికి కృతజ్ఞతలు. మా జట్టులో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారితో పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని స్టెఫెన్‌ జోన్స్‌ తెలిపాడు. ఈ మాజీ పేసర్‌ భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఆర్‌ అకాడమీలకు సేవలు అందిస్తున్నాడు. ‘‘గత కొన్నేళ్లుగా స్టెఫెన్‌ మా ఫ్రాంచైజీతో కలిసి పని చేస్తున్నారు. ఇక్కడి సంప్రదాయాలు బాగా తెలుసు. గతంలో ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు అనుకూలంగా ఉండే ప్రత్యేకమైన కోచింగ్‌ శైలిని తీసుకొచ్చారు’’ అని ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర వెల్లడించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని