RR vs RCB: ఆ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు: సంజూ శాంసన్

ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్‌ (RR).. కీలక సమయంలో మాత్రం డీలాపడిపోయింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకొనే పరిస్థితికి వచ్చింది. తాజాగా బెంగళూరు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.

Published : 15 May 2023 10:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను కేవలం 59 పరుగులకే కుప్పకూల్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. ఈ క్రమంలో రాజస్థాన్‌ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు కాగా.. రాజస్థాన్‌ జట్టుకు ఇది రెండోది కావడం గమనార్హం. అంతకుముందు 2009 సీజన్‌లో బెంగళూరుపైనే 58 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా మాత్రం బెంగళూరే ఉండటం విశేషం. 2017 సీజన్‌లో కోల్‌కతాపై ఆర్‌సీబీ 49 పరుగులకే కుప్పకూలింది. 

ఈ ఓటమితో రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు సన్నగిల్లాయి. తన చివరి మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంది. తొలి ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్‌.. గత ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లోనే గెలవడం గమనార్హం. ఈ క్రమంలో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంచి ఆరంభం వచ్చినా వెనుకంజ వేయడానికిగల కారణం ఏంటనే వ్యాఖ్యాత ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 

‘‘మీరు అడిగిన ప్రశ్న గొప్పగానే ఉంది. కానీ, తప్పు ఎక్కడ జరిగిందనే దానిని ఆలోచించా. సమాధానం మాత్రం నా వద్ద లేదు. ఐపీఎల్‌ తీరే అలా ఉంటుంది. రోజుల్లోనే ఫలితాలు మారిపోతాయి. ముగింపు దశలో చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికీ మేం మానసికంగా బలంగా ఉన్నాం. ధర్మశాల మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని శాంసన్‌ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

* రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరారు. యశస్వి, బట్లర్, అశ్విన్, కేఎం అసిఫ్ డకౌట్ అయ్యారు. 

* అత్యధిక మార్జిన్‌తో ముగిసిన ఏడో మ్యాచ్‌. రాజస్థాన్‌పై బెంగళూరు 112 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రికార్డు ముంబయి ఇండియన్స్‌ పేరిట ఉంది. 2017 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

* ప్రస్తుత విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఆర్‌సీబీకి (12 పాయింట్లు) ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్‌ 12 పాయింట్లతో ఆరో స్థానానికి దిగజారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు