IPL - 2022 : బలహీనతలను అధిగమిస్తేనే అత్యుత్తమ ఫలితాలు : మలింగ

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన పేసర్లతో తమ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌ లసిత్ మలింగ అన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు...

Published : 23 Mar 2022 01:37 IST

(Photo : Malinga Twitter)

ఇంటర్నెట్ డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన పేసర్లతో తమ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌ లసిత్ మలింగ అన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. ఇటీవల మలింగను రాజస్థాన్ బౌలింగ్‌ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. 

‘మా జట్టులో ట్రెంట్‌ బౌల్ట్‌, కోల్టర్‌ నైల్‌ వంటి అనుభవమున్న విదేశీ బౌలర్లు ఉన్నారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, నవదీప్‌ సైని లాంటి యువ పేసర్లు ఉన్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో మా జట్టు బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్లో బౌలర్లు ఇచ్చే కొన్ని పరుగులే.. జట్టు ఫలితాన్ని తారుమారు చేస్తాయి. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా వారికి మార్గ దర్శనం చేయడమే బౌలింగ్‌ కోచ్‌గా నా బాధ్యత. ప్రత్యర్థి జట్టులోని బలహీనతలపైనే చాలా మంది దృష్టి పెడుతుంటారు. కానీ, నా అనుభవం ప్రకారం.. మనలోని బలహీనతలను అధిగమించి అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లు సమతూకంగానే ఉంటాయి. మనం ఆటను ఎలా అర్థం చేసుకుంటామనేదే కీలకం.  ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేసేలా బౌలర్లను తీర్చి దిద్దుతాను’ అని మలింగ చెప్పాడు. 

‘కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం, బౌలర్‌గా నాకున్న అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవడం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇంతకు ముందు ముంబయి జట్టు తరఫున ఆడాను. ప్రస్తుతం రాజస్థాన్‌ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న యువ పేసర్లలో కలిసి పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. నిజానికి గతేడాదే రాజస్థాన్‌ జట్టు హెడ్‌ కోచ్‌ సంగక్కర ఆసక్తి ఉంటే బౌలింగ్‌ కోచ్‌గా చేరాలని కోరాడు. కానీ, కరోనా, బయో బబుల్ కారణంగా అది సాధ్యం కాలేదు’ అని మలింగ పేర్కొన్నాడు. 2019 సీజన్‌ వరకు మలింగ ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని