Lucknow vs Rajasthan: చెలరేగిన సంజు, జురెల్‌.. లఖ్‌నవూపై రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌-2024లో రాజస్థాన్‌ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది.

Updated : 27 Apr 2024 23:52 IST

లఖ్‌నవూ: ఐపీఎల్ (IPL) 17 సీజన్‌లో రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. లఖ్‌నవూపై సంజు సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇది ఎనిమిదో గెలుపు. ఈ విజయంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. యశస్వి జైస్వాల్ (24; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (34; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించగా.. సంజు శాంసన్‌ (Sanju Samson) (71*; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. ధ్రువ్‌ జురెల్ (52*; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. శాంసన్, జురెల్ జోడీ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం.  రియాన్‌ పరాగ్ (14) ఈ సారి నిరాశపర్చాడు. శాంసన్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  లఖ్‌నవూ బౌలర్లలో అమిత్ మిశ్రా, స్టాయినిస్, యశ్‌ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. 

లఖ్‌నవూ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (76; 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్‌ హుడా (50; 31 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. క్వింటన్ డికాక్ (8), స్టాయినిస్‌ (0), నికోలస్ పూరన్‌ (11) నిరాశపర్చారు. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూను రాహుల్, దీపక్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆయుష్ బదోని (18*), కృనాల్ పాండ్య (15*) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో సందీప్ శర్మ 2, ట్రెంట్ బౌల్ట్, అవేశ్‌ ఖాన్‌, అశ్విన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని