BCCI: ఫైనల్‌ మ్యాచ్ వేదికపై ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలు.. బదులిచ్చిన బీసీసీఐ

భారత్‌లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లకు ముంబయి వేదిక కావాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కోరడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పందించారు. 

Updated : 06 Jul 2024 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుని సొంతగడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియాకు ముంబయి ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ అభిమానులతో ముంబయి సముద్ర తీరం జనసంద్రంగా మారింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aditya Thackrey).. భవిష్యత్తులో భారత్‌లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లకు ముంబయి వేదిక కావాలన్నారు. వాటిని ఇక్కడే  నిర్వహించాలని బీసీసీఐని కోరారు. ఆదిత్య వ్యాఖ్యలపై తాజాగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) స్పందించారు.

‘‘టీమ్‌ఇండియాపై ముంబయి ప్రజలు చూపిన అభిమానానికి సంతోషిస్తున్నాం. అయితే.. ప్రధాన టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌ల కోసం దేశంలోని అన్ని వేదికలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్‌ మ్యాచ్‌ ఎక్కడ జరగాలనేది పూర్తిగా బీసీసీఐ విధానాలకు సంబంధించిన అంశం. ఒక్క నగరానికే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోదు. 1987లో వన్డే వరల్డ్‌ కప్‌ కోల్‌కతాలో జరిగింది. ఆ ప్రాంతాన్ని అదృష్టంగా భావిస్తాం. కానీ, ఫైనల్‌ మ్యాచ్‌ ఒక్క నగరంలో మాత్రమే జరగాలని భావించదు’’ అని శుక్లా పేర్కొన్నారు.

ఓపెనర్‌గా రావాలనుకుంటున్నా.. రోహిత్‌, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్‌మన్‌ గిల్‌

ప్రతి మ్యాచ్‌ కీలకమే..

‘‘మాకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. గతంలో ముంబయి వేదికగా సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. అహ్మదాబాద్‌ మైదానంలోనూ లక్ష మందికి పైగా కూర్చునేందుకు సౌకర్యం ఉంటుంది. మ్యాచ్‌ ఎక్కడ జరగాలో స్టేడియం సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ముంబయి ఎప్పుడూ మేం ప్రాధాన్యతనిచ్చే జాబితాలో ఉంటుంది’’ అని శుక్లా వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని