IND vs PAK: ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ శక్తిమంతం.. అయినంత మాత్రాన మేం సేవకులమా?: రమీజ్‌

పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించారు.. అయినా సరే భారత్‌ను విమర్శించడానికి ఏమాత్రం అవకాశం దొరికినా రమీజ్‌ రజా వదులుకోవడం లేదు. తాజాగా మరోసారి టీమ్ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కేశాడు. 

Published : 31 Dec 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్: పదవి నుంచి తీసేసినా.. రోజూ భారత్‌పై నోరుపారేసుకోవడం మాత్రం పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్ రజా ఆపడం లేదు. తమ వల్లే టీమ్‌ఇండియా కెప్టెన్‌ మారాడంటూ వ్యాఖ్యలు చేసిన రమీజ్‌ రజా.. తాజాగా భారత్‌కు సర్వెంట్లుగా పనిచేయడం లేదని పేర్కొన్నాడు. పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించడంతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికే టీమ్‌ఇండియాపై మాటల యుద్ధం చేస్తున్నాడని అభిమానులు విమర్శలు గుప్పించారు. అసలు రమీజ్‌ రజా ఏ ఉద్దేశంతో ఎందుకీ వ్యాఖ్యలు చేశాడంటే..?

బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా గతలో పాక్‌ వేదికగా జరిగే టోర్నీలో (ఆసియా కప్‌ 2023) ఆడేది లేదని చెప్పారు. తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని స్పష్టం చేశారు. అప్పుడు పీసీబీ (రమీజ్‌ నేతృత్వంలోని) కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడేది లేదని అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పీసీబీ ఛైర్మన్‌ నజామ్‌ సేథి కూడా ఇదే విషయంపై గట్టిగా నిలబడాలని రమీజ్‌ రజా డిమాండ్ చేశాడు. అలాగే ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) బోర్డును సమావేశపరిచి నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు.

‘‘ఇదేమీ నాయకత్వం..? వెంటనే ఏసీసీ బోర్డు సమావేశం నిర్వహించాలి. ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని పాక్‌ను ఏసీసీ అడిగింది. పాక్‌లో అయితే తాము టోర్నీ ఆడేది లేదని వెంటనే భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థ వేదికకు మార్చాలని చెప్పింది. దీనిపై ఏసీసీ స్పందన ఏంటి..? ప్రపంచ క్రికెట్‌లో శక్తిమంతమైనంత భారత్‌కు మేం సేవకులమా...? వారు చెప్పింది ప్రతిదీ మేం వినాలా..? కచ్చితంగా పాకిస్థాన్‌ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహించాల్సిందే. దాని కోసం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం పాక్‌ క్రికెట్‌ ఉన్నత స్థాయిలో ఉంది. జట్టులో సూపర్‌స్టార్‌లు ఉన్నారు. భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కాబట్టి టీమ్‌కు మర్యాద ఇవ్వండి’’ అని రమీజ్‌ రజా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని