Ramiz: ద్రవిడ్‌ను గావస్కర్‌ విమర్శించడం ఎప్పుడూ చూడం.. కానీ పాక్‌లో: రమీజ్‌ రజా

పాకిస్థాన్‌ క్రికెట్‌లో (Pakistan Cricket) మాజీలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనే స్థాయికి వెళ్లారు. అదీనూ ప్రస్తుత కెప్టెన్‌ గురించి కావడం గమనార్హం.

Updated : 25 Feb 2023 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్, పాక్‌ మాజీ కెప్టెన్ రమీజ్‌ రజా (Ramiz Raja), ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ (Shoaib Akhtar) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌పై (Babar Azam) అక్తర్‌ కామెంట్లు చేయడంతో రమీజ్‌ రజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్‌ అజామ్‌ కమ్యూనికేషన్‌ సరిగా ఉండదని, సరిగ్గా ఇంగ్లిష్‌ కూడా మాట్లాడలేడని అక్తర్‌ విమర్శించాడు. దీంతో అక్తర్‌పై మాజీలు విరుచుకుపడ్డారు. అంతకుముందు కమ్రాన్‌ అక్మల్‌పై కూడా ఇలానే అక్తర్‌ అనవసర వ్యాఖ్యలు చేశాడు. దీంతో రమీజ్‌ రజా కాస్త ఘాటుగానే అక్తర్‌ను తూర్పారపట్టాడు. 

‘‘షోయబ్ అక్తర్‌ సూపర్‌స్టార్‌ అనే భ్రమల్లో ఉంటాడు. గతంలో కమ్రాన్‌ అక్మల్‌తోనూ అతడికి సమస్య వచ్చింది. ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా బద్నాం చేయడానికే చూస్తుంటాడు. అయితే, తొలుత మనిషిగా ఉండటం ముఖ్యం. మనిషిగా మారిన తర్వాతే బ్రాండ్‌గా మారదాం. ఇలాంటి చెత్త స్టేట్‌మెంట్లతో పాక్‌ క్రికెట్‌ దిగజార్చ వద్దని కోరుతున్నా. పొరుగు దేశంలో ఇలా జరగడం నువ్వెప్పుడూ చూసి ఉండవు. సునీల్‌ గావస్కర్ (Sunil Gavaskar Trophy) వంటి క్రికెట్‌ దిగ్గజం ఎప్పుడూ కూడా రాహుల్‌ ద్రవిడ్‌ను (Rahul Dravid) విమర్శించిన దాఖలాలు లేవు. అయితే, ఇలా కేవలం పాక్‌లోనే జరుగుతుంది. ఆటగాళ్లను తమ విధులను సరిగ్గా చేయనీయకుండా మాజీలు అడ్డుపుల్లలు వేస్తుంటారు. పీసీబీ ఛైర్మన్‌ కావాలంటే ముందు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ చేసి ఉండాలి. అప్పుడే పోటీ చేయడానికి అర్హత ఉంటుందని తెలుసుకోవాలి’’ అని రమీజ్‌ రజా వ్యాఖ్యానించాడు. ఇటీవల బాబర్‌ అజామ్‌ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో విలేకర్లపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దానిని, దృష్టిలో ఉంచుకొనే షోయబ్‌ అక్తర్‌ విమర్శలు గుప్పించాడు. అయితే, సరిగ్గా ఆంగ్ల భాష మాట్లాడలేడని వ్యాఖ్యానించడంతో మాజీలు అక్తర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని