MS Dhoni: ‘ఎం.ఎస్‌.ధోనీ.. అత్యంత నిస్వార్థ ఆటగాడు’

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) అత్యంత నిస్వార్థ ఆటగాడని పలువురు మాజీ క్రికెటర్లు ఓ కార్యక్రమంలో చెప్పారు.

Published : 09 Mar 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులున్నారు. చాలా క్రికెటర్లు సైతం ‘కెప్టెన్‌ కూల్‌’ని అభిమానిస్తారు. తాజాగా జియో సినిమా, స్టోర్ట్స్‌ 18 ఛానల్‌ నిర్వహించిన ‘ర్యాపిడ్‌ ఫైర్‌ విత్ ది లెజెండ్స్‌’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ధోనీతో ఉన్న అనుబంధాన్ని, అతడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, పార్థివ్‌ పటేల్, రాబిన్‌ ఊతప్పతోపాటు వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్ పాల్గొన్నారు. ర్యాపిడ్‌ ఫైర్‌లో చోప్రా వేసిన ప్రశ్నలకు ఎవరో ఏం సమాధానమిచ్చారంటే.. 

ప్రశ్న: అత్యంత నిస్వార్థ ఆటగాడు ఎవరు?

మొదటి ఈ ప్రశ్నను రాబిన్‌ ఊతప్పను అడగ్గా.. అతడు మహేంద్ర సింగ్‌ ధోనీ అని సమాధానమిచ్చాడు. తర్వాత స్ట్రెరిస్‌ ఈ ప్రశ్నకు విలియమ్సన్‌ అని జవాబిచ్చాడు. దీంతో ఆకాశ్ చోప్రా జోక్యం చేసుకుని కివీస్ ఆటగాడు కాకుండా మరో క్రికెటర్‌ను ఎంచుకోవాలని స్కాట్‌ని కోరగా.. అతడు ధోనీని ఎంచుకున్నాడు. పార్థివ్ పటేల్ తనను తాను (సరదాగా) నిస్వార్థ ఆటగాడిగా చెప్పుకోవడంతో అక్కడున్నవారు కాసేపు  నవ్వుకున్నారు. అనిల్ కుంబ్లే, క్రిస్‌ గేల్ కూడా ధోనీ పేరే చెప్పారు. అంటే ఐదుగురిలో నలుగురు ధోనీకే ఓటు వేశారన్నమాట.

ప్రశ్న: మోస్ట్‌ ఫ్యాషనెబుల్ (స్టైలిష్‌) ప్లేయర్‌ ఎవరు? 

అనిల్ కుంబ్లే.. భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh) పేరు చెప్పగా.. పార్థివ్ పటేల్ లసిత్ మలింగని ఎంచుకున్నాడు. స్కాట్ స్ట్రైరిస్ వెస్టిండీస్‌ ఆటగాళ్లలో ఎవరినైనా స్టైలిష్‌ ప్లేయర్‌గా భావించొచ్చు అని చెప్పగా.. నీ ముందు కూర్చుని ఉన్న క్రిస్‌ గేల్‌ అందుకు సరిపోతాడా అని చోప్రా అడగ్గా.. స్కాట్‌ అవును అని సమాధానమిచ్చాడు.

ప్రశ్న: ఫన్నీ స్లెడ్జింగ్‌ చేసింది ఎవరు? 

ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ షేన్ వార్న్‌, మాథ్యూ హేడెన్‌ తనపై సరదాగా స్లెడ్జింగ్‌ చేశారని స్కాట్ స్ట్రైరిస్‌ చెప్పాడు. తనపై ఎవరు స్లెడ్జింగ్‌ చేయలేదని రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్ చాలాకాలంపాటు ఆర్సీబీ (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే, జట్టులో ఎంతోమంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ఒక్కసారిగా కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై అభిమానుల, మీడియా ఫోకస్‌ బెంగళూరు జట్టు టైటిల్ ఆశలను దెబ్బతీసిందా? అని క్రిస్‌ గేల్‌ను స్కాట్ స్ట్రైరిస్‌ ప్రశ్నించాడు. ‘నేను ఆర్సీబీ తరఫున ఆరేళ్లు ఆడాను. టైటిల్ గెలవాలంటే సరైన జట్టు ఉండాలి. జట్టుకు సమయం కేటాయించాలి. జట్టు సభ్యులు ఒక కుటుంబంలా ముందుకు సాగితే ఛాంపియన్‌గా నిలవొచ్చు. రాబిన్‌ ఊతప్ప ప్రస్తావించినట్టుగా చాలామంది ఆటగాళ్లు జట్టు నుంచి వెళ్లిపోయారు. అనేక మంది ఆటగాళ్లు తాము ఫ్రాంచైజీ భాగం అని భావించలేదు. జట్టులో నాతోపాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై మాత్రమే ఎక్కువ ఫోకస్‌ ఉండేది. దాంతో చాలా మంది క్రికెటర్లు మానసికంగా తాము జట్టులో లేమని భావించారు. అందుకే  ఆర్సీబీకి టైటిల్ గెలవడం సవాలుగా మారింది’ అని గేల్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని