Rashid Khan: ఆ నమ్మకాన్ని మేం వమ్ము చేయలేదు.. ఈ విజయం అతడికే అంకితం: రషీద్ ఖాన్

పొట్టి కప్‌లో మరో సంచలనం నమోదైంది. తొలిసారి అఫ్గానిస్థాన్ సెమీస్‌కు వచ్చింది. సూపర్-8లోని గ్రూప్‌-1లో భారత్‌తోపాటు అఫ్గాన్‌ నాకౌట్‌కు చేరింది.

Published : 25 Jun 2024 14:57 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) తొలిసారి సెమీస్‌కు చేరి అఫ్గానిస్థాన్ చరిత్ర సృష్టించింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను ఓడించి.. కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి మరీ అఫ్గాన్‌ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. తమ విజయం వెనక చాలామంది కృషి ఉందని.. ఈ ఘనతను విండీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు అంకితం చేస్తున్నట్లు అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘మేం సెమీఫైనల్స్‌కు చేరగలమని నమ్మకం ఉంచిన ఒకేఒక్కరు బ్రియాన్‌ లారా. మెగా టోర్నీకి ముందు ఓసారి అతడిని కలిసినప్పుడు.. మీ మాటలను వమ్ము చేయమని అప్పుడే చెప్పాం. వరల్డ్‌ కప్‌ వంటి మెగా సంగ్రామంలో సెమీస్‌కు చేరడం మా కల. ఇప్పటికి అది నెరవేరింది. న్యూజిలాండ్‌ను ఓడించడంతో మాపై నమ్మకం కలిగింది. మా జట్టు పట్ల గర్వంగా ఉన్నా. ఈ పిచ్‌ మీద 130 పరుగులు మంచి స్కోరు అని భావించా. కానీ బ్యాటింగ్‌లో 20 పరుగులు వెనకబడ్డాం. అయితే, 115 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలో ఛేదించేందుకు వారు దూకుడుగా ఆడతారని తెలుసు. అదే మాకు అడ్వాంటేజ్‌గా మారింది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేస్తే సత్ఫలితం ఉంటుందని ప్రణాళికలు సిద్ధం చేసుకుని బరిలోకి దిగాం. ప్లాన్స్‌ను సరిగ్గా అమలుచేశాం. వర్షం మన చేతుల్లో ఉండదు. వందశాతం విజయం కోసం శ్రమించి సక్సెస్ అయ్యాం’’ అని రషీద్ తెలిపాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4 వికెట్ల ప్రదర్శనను రషీద్ 9 సార్లు సాధించి షకిబ్ (8)ను అధిగమించాడు. 

గత కొన్నేళ్లుగా శ్రమిస్తున్నాం: నవీనుల్ హక్

‘‘సెమీస్‌కు చేరడం చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేళ్లుగా మేం చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. పవర్‌ ప్లేలో వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి పిచ్‌ మీద భారీ స్కోర్లు నమోదు కావడం చాలా కష్టం. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తోపాటు వైవిధ్యంగా బంతులేస్తేనే వికెట్లు తీయడం ఈజీ అవుతుంది’’ అని నవీనుల్‌ హక్ తెలిపాడు. కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసిన అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని