
Afghan Crisis: కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్న రషీద్‌ఖాన్
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో వారికి భయపడి వేలాది మంది ప్రజలు అఫ్గాన్‌ను వదిలి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. కాబుల్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో కాబుల్‌కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కాగా అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్‌ఖాన్ ఆవేదనకు గురవుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. రషీద్ తన కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్నట్లు పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘హండ్రెడ్’ టోర్నీలో రషీద్‌ఖాన్ ట్రెంట్ రాకెట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పీటర్సన్ స్పందించాడు. ‘అఫ్గానిస్థాన్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై రషీద్‌తో చాలాసేపు చర్చించా. అతడు చాలా బాధపడుతున్నాడు. తన కుటుంబాన్ని అఫ్గాన్ నుంచి తరలించలేకపోయాడు. ఈ విషయమై అతడు కుమిలిపోతున్నాడు’ అని పీటర్సన్ వెల్లడించాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్ బయటపడాలని పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని ఈమధ్యే రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. తమను అరాచకత్వంలో వదిలేయొద్దని.. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తినష్టం విపరీతంగా జరుగుతోందని ఆందోళన చెందాడు. అఫ్గానిస్థాన్ నాశనాన్ని ఆపేయాలని, తమకు శాంతి కావాలని రషీద్ ట్విటర్ వేదికగా కోరాడు.