Virat Kohli: కోహ్లీని తొలగించే సెలెక్టర్‌ ఇంకా పుట్టలేదు: పాక్‌ మాజీ కెప్టెన్

విరాట్‌ కోహ్లీని తొలగించే సెలెక్టర్ ఇంకా పుట్టలేదని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్‌ (16) మరోసారి...

Published : 16 Jul 2022 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీని తొలగించే సెలెక్టర్ ఇంకా పుట్టలేదని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్‌ (16) మరోసారి నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆటతీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తుండగా మరికొంత మంది అతడిని జట్టులో నుంచి తొలగించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన లతీఫ్‌ భారత్‌లో కోహ్లీని తప్పించే సెలెక్టర్‌ ఇంకా పుట్టలేదన్నారు.

ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ సైతం స్పందిస్తూ కోహ్లీకి ఓ సూచన చేశాడు. అతడు ఆఫ్‌సైడ్‌ బంతులను ఆడొద్దని చెప్పాడు. కొంతకాలంగా విరాట్‌ ఈ బంతులకే ఔటౌవుతున్న సంగతి తెలిసిందే. రెండో వన్డేలోనూ విల్లే బౌలింగ్‌లో ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ బంతికి కీపర్‌కు చిక్కాడు. ‘‘కోహ్లీ ఈ మ్యాచ్‌లో మళ్లీ బాగా ఆడేలా కనిపించాడు. కానీ, యథావిధిగా ప్రత్యర్థి జట్టు అతడిని ఔట్‌ చేయాలని ఆఫ్‌స్టంప్‌ ఆవల సరైన లెంగ్త్‌లో బంతిని సంధించింది. ఇలాంటి బంతులను కోహ్లీ అర్థం చేసుకొని ఆడాలి. ‘ఎలాంటి బంతులను వదిలేయాలి. ఎలాంటి వాటిని ఆడాల’ని అతడే నిర్ణయించుకోవాలి. ప్రతి ఇన్నింగ్స్‌ అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కచ్చితంగా అతని సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతాయి. తర్వాతి మ్యాచ్‌ అనేది కోహ్లీకి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది’’ అని జాఫర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్‌తో చివరి వన్డే తర్వాత టీమ్‌ఇండియా విండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఇటీవల ఆ పర్యటనకు ఎంపిక చేసిన జట్లలో కోహ్లీకి టీ20ల నుంచి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని