Ravi Shastri: టెస్టు క్రికెట్‌లో పోటీతత్వం పెరగాలంటే ఆ వ్యవస్థను తీసుకురావాలి: రవిశాస్త్రి

టెస్టు క్రికెట్‌(Test Cricket)లో పోటీతత్వాన్ని కొనసాగించడానికి భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక సూచనలు చేశాడు. 

Published : 09 Jul 2024 14:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లు పుట్టుకొస్తుండటంతో టెస్టు (Test Cricket) మ్యాచ్‌లకు రానురాను ఆదరణ తగ్గిపోతోంది. సుదీర్ఘ ఫార్మాట్‌ పునర్‌వైభవం సాధించాలంటే టెస్ట్ క్రికెట్‌ను సమూలంగా పునర్నిర్మించాలని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) సూచించాడు. టెస్టు క్రికెట్‌లో పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై లార్డ్స్‌లో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నిర్వహించిన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ ఈవెంట్‌లో రవిశాస్త్రి మాట్లాడారు. ప్రమోషన్, బహిష్కరణ వ్యవస్థ ద్వారా టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాల సంఖ్యను ఆరు లేదా ఏడుకి తగ్గించాలని ప్రతిపాదించాడు. 

‘‘టెస్టు క్రికెట్‌లో నాణ్యత లేనప్పుడు రేటింగ్‌లు పడిపోతాయి.  మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు కూడా తక్కువగా వస్తారు. అప్పుడిది ఉపయోగం లేని క్రికెట్ అవుతుంది. ఆటకు ఇది మంచిది కాదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. బలమైన జట్ల మధ్య టెస్ట్ క్రికెట్‌ను కేంద్రీకరించడం ద్వారా ఈ ఫార్మాట్ పోటీతత్వాన్ని సంతరించుకొని ఎక్కువమంది ప్రేక్షకులను, వీక్షకులను ఆకర్షిస్తుందన్నాడు. ‘‘ప్రస్తుతం 12 దేశాలు టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాయి. దానిని ఆరు లేదా ఏడుకి తగ్గించి ప్రమోషన్, బహిష్కరణ వ్యవస్థను తీసుకురావాలి. మనకు ఈ ఫార్మాట్‌లో రెండు రకాల జట్లు ఉన్నాయి. కానీ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తిని కొనసాగించడానికి మొదటి ఆరు జట్లే ఆడాలి’’ అని భారత మాజీ కోచ్ సూచించాడు. 

రవిశాస్త్రి సూచించిన ఈ విధానం కొత్తది కాదు. కానీ, ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించాలంటే ఈ విధానాన్ని అమలుచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్, బహిష్కరణ విధానం అమల్లోకి వస్తే అత్యుత్తమంగా రాణించిన జట్లే టెస్టు క్రికెట్ ఆడతాయి. అప్పుడు ఆటలో నాణ్యత కూడా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని