WTC Final: గిల్‌ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC Final 2023) భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ ఆడుతోంది. అయితే, సీనియర్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, పుజారా, రోహిత్ శర్మ త్వరగా పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు.

Published : 10 Jun 2023 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో శతకాలు బాది అనుభవం సాధించిన ఛెతేశ్వర్‌ పుజారా (14) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC Final 2023) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అదీనూ వికెట్లకు అడ్డుగా నిలిచి మిస్టర్ నయా వాల్‌గా పేరొందిన పుజారా బౌల్డ్‌ కావడం గమనార్హం. కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ వికెట్‌ మీదుగా వచ్చిన బంతిని వదిలేసి బౌల్డయ్యాడు. అంతకుముందు యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ కూడా బోలాండ్‌ బౌలింగ్‌లోనే ఇలానే ఆఫ్‌ వికెట్‌ వైపుగా విసిరిన బంతిని వదిలేసి క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 

‘‘ఇంగ్లాండ్‌ పిచ్‌లపై బంతిని వదిలేయడంతో పాటు ఆఫ్‌ స్టంప్‌ ఎక్కడ ఉందనే దాని గురించి మాట్లాడతాం. ఆఫ్‌ స్టంప్‌ ఎక్కడ ఉందో తెలియకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో భారత్‌కు అర్థమైంది. తొలుత శుభ్‌మన్‌ గిల్ తన ఫుట్‌వర్క్‌ విషయంలో కాస్త బద్దకంగా ఉన్నాడనిపించింది. అయితే గిల్ కుర్రాడు కాబట్టి తప్పకుండా నేర్చుకుంటాడు. కానీ, పుజారా అలా కాదు కదా.. అతడి ఆటను చూసిన తర్వాత తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. బంతి గమనం లైన్‌కు ఇవతలగా వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆఫ్‌స్టంప్‌ ఎక్కడ ఉందో తెలియాలి. ఆడదామా..? వద్దా..? అనే నిర్ణయం తప్పిదం కారణంగానే పుజారా బౌల్డయ్యాడు. బంతి వైపుగా ఫుట్‌వర్క్‌ లేకపోవడం వల్ల కలిగిన అనర్థం ఇది. పుజారా బంతిని వదిలేయడంతో తన ఆఫ్‌ స్టంప్‌ క్లియర్‌గా కనిపించింది. తాను ఆడిన దిశలో ఆఫ్‌ వికెట్‌ ఆవల పడుతుందని భావించాడు. వదిలేయడంతో బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరక తప్పలేదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని