WTC Final: ‘ఆస్ట్రేలియా ఫేవరెట్’.. ఫలితం తారుమారు కావడానికి ఒక్క రోజు చాలు: రవిశాస్త్రి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో ఏ జట్టు విజయం సాధిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటంతో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

Published : 03 Jun 2023 16:35 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) తలపడనున్నాయి. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. ఈ సారి కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగానే ఉండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై వివిధ దేశాల పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీరిలో చాలామంది ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ( Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

‘‘భారత్‌.. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌లో ఆడుతోందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా ఉంది. కానీ, ఇది ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌. ఒక్క రోజు బాగా ఆడకపోయినా మ్యాచ్‌ చేజారినట్లే. కాబట్టి.. ఆస్ట్రేలియా కూడా జాగ్రత్తగా ఉండాలి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌ విజేతగా నిలిచి పదేళ్లవుతోంది. 2013లో ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీని అందుకుంది.  పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ సారి టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవొచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.  ‘‘ఐసీసీ టోర్నీల్లో ఎవరైనా సరే గట్టిగా పోరాడాల్సిందే.  అయితే కొన్నిసార్లు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. మనం మంచి క్రికెట్ ఆడలేదని నేను చెప్పను. మనవాళ్లు చాలా మంచి క్రికెట్ ఆడారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిసిరాలేదు. ఈ టీమ్‌కు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉంది. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెబుతుండేవాడిని. గత మూడు, నాలుగేళ్ల నుంచి ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నమ్ముతున్నాను. ఆ శక్తి ఆటగాళ్లలో ఇప్పటికీ ఉందని భావిస్తున్నా ’’ అని భారత మాజీ కోచ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని