Ravi Shastri - Virat Kohli: కోహ్లీ ఒక్కడే కాదు.. ఇంకా ఒకరిద్దరు అలాగే ఉన్నారు: రవిశాస్త్రి

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు...

Updated : 20 Apr 2022 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 19.83 పేలవ సగటుతో 119 పరుగులే చేశాడు. గతరాత్రి లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో గోల్డన్‌ డకౌటయ్యాడు. దీంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌కుముందు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్‌.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతాడని, భారీ పరుగులు చేస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇలా విఫలమవుతూ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు.

‘ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానుభూతితో ఉండాలి. వారిపై అనవసర ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. వాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. నేనిక్కడ నేరుగా కోహ్లీ పేరే చెప్పదల్చుకున్నా. అతడిప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. టీమ్‌ఇండియాలో ఎవరికైనా విశ్రాంతినివ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే. అది రెండు నెలలలైనా, నెలన్నర రోజులైనా ఫర్వాలేదు. అది కూడా ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు లేదా తర్వాత. అతడిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. ఇలా తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నది అతనొక్కడే కాదు. ప్రపంచ క్రికెట్‌లో ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లకున్న అసలు సమస్య ఏంటో గుర్తించాలి’ అని శాస్త్రి పేర్కొన్నాడు. కాగా, శాస్త్రి మాటలతో ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ ఏకీభవించాడు. రవిశాస్త్రి వందశాతం నిజం చెప్పాడన్నాడు. ‘కోహ్లీ గతకొన్నేళ్లుగా చాలా విషయాలపై దృష్టిసారించాల్సి వచ్చింది. అతడు కొద్ది కాలం తన బూట్లకు విరామం పలకాలి. సామాజిక మాధ్యమాలు కూడా వాడకుండా ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా గడపాలి. నూతనోత్సాహంతో మళ్లీ తిరిగి రావాలి. అప్పుడు జట్టులో చేరి మరింత గొప్పగా రాణిస్తాడు’ అని పీటర్సన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని