Ravi Shastri : అప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు వాయిదా వేయడం.. సమర్థనీయమే: రవిశాస్త్రి

గతేడాది కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసేసమయానికి ...

Updated : 02 Jul 2022 19:47 IST

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్‌ 338/7 స్కోరు చేసింది. రిషభ్‌ పంత్ (146) శతకానికితోడు రవీంద్ర జడేజా (83*) సమయోచిత ఇన్నింగ్స్‌ టీమ్‌ఇండియాను  నిలబెట్టింది. ఈ క్రమంలో టెస్టు మ్యాచ్‌పై భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి స్పదించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా రవిశాస్త్రినే టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్‌ అనంతరం రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 

‘‘గత ఏడాది కరోనా పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడండి అని చెప్పడం చాలా తేలికే. అయితే చాలా మంది ఆటగాళ్లు కుర్రాళ్లు. వారికి కుటుంబాలు ఉంటాయి. ఇక కొవిడ్‌ ఎవరి నుంచి వస్తుందనేది చెప్పలేని విషయం. కొవిడ్ సోకడం.. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉండటం ఒకటి కాదు. ఎనిమిది నెలల కిందట కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులే చెప్పలేకుండా ఉన్నారు. ఇవాళ అదొక ఫ్లూ మాత్రమేనని చెబుతున్నారు. ఆ సమయంలో ఆడితే పోయేదేముందని చెప్పినవారు తమ మనస్తత్వం కారణంగానే ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు. పొరపాటున టెస్టు మ్యాచ్‌ మధ్యలో ఎవరికైనా కరోనా సోకితే మిగతా వారి పరిస్థితి భయంకరంగా ఉండేది. అందుకే అప్పుడు టీమ్‌ఇండియా ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడకుండానే వచ్చేయాలనే నిర్ణయం ముమ్మాటికీ సమర్థనీయమే. ఇప్పుడు దానిని మళ్లీ నిర్వహించడం అభినందనీయం‘’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గత ఏడాది టెస్టు వాయిదా పడేనాటికి భారత్‌ 2-1 తేడాతో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యంలో ఉంది. ఈ టెస్టు మ్యాచ్‌ ముందు కూడానూ టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడటం గమనార్హం. దీంతో బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని