Arjun Tendulkar: చివరి ఓవర్‌లో ఎలా బౌలింగ్‌ చేయాలో అర్జున్‌కు తెలుసు: రవిశాస్త్రి

దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ కుమారుడైనప్పటికీ అవకాశాలు మాత్రం త్వరగా రాలేదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం అర్జున్ తెందూల్కర్‌ (Arjun Tendulkar) సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) అరంగేట్రం చేసిన అర్జున్ తాను ఆడిన రెండు మ్యాచుల్లో ఫర్వాలేదనిపించాడు.

Published : 22 Apr 2023 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ తెందూల్కర్‌ (Arjun Tendulkar) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) 16వ సీజన్‌లో అరంగేట్రం చేసేశాడు. కోల్‌కతా మీద తొలి మ్యాచ్‌ ఆడిన అర్జున్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తన మొదటి వికెట్‌ను (First Wicket) ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్‌తో చివరి ఓవర్‌ వేసిన అర్జున్‌ అద్భుతమైన యార్కర్లను సంధించాడు. భువనేశ్వర్‌ను ఔట్‌ చేసి తొలి ఐపీఎల్‌ వికెట్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అర్జున్‌పై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు జల్లు కురిపించాడు. ఐపీఎల్‌లో తన తండ్రి రికార్డును అధిగమించిన  కుమారుడిగా అర్జున్‌ నిలిచాడని కితాబిచ్చాడు. ఐపీఎల్‌లో సచిన్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. అర్జున్‌కు తన రెండో మ్యాచ్‌లోనే వికెట్ దక్కడం  విశేషం. ఇవాళ పంజాబ్‌తో ముంబయి ఇండియన్స్‌ తలపడనుంది. 

‘‘హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. చివరి ఓవర్‌ వేసిన అర్జున్‌ తెందూల్కర్‌ వికెట్ తీసుకున్నాడు. అయితే, అంతకుమించి అతడు సంధించిన యార్కర్లు అద్భుతంగా ఉన్నాయి. కీలకమైన ఆఖరి ఓవర్‌లో ఎలా బౌలింగ్‌ చేయాలనేదానిపై అర్జున్‌కు పూర్తి క్లారిటీ ఉంది. పేస్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ తన తండ్రి సాధించని రికార్డును సొంతం చేసుకున్నాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌ తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడి ఈ సీజన్‌ను పేలవంగా ప్రారంభించింది. అయితే, గత మూడింట్లోనూ విజయం సాధించి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని