MS Dhoni: డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ధోనీ తిరిగొస్తే.. రవిశాస్త్రి సూపర్ ఆన్సర్!

వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (WTC Final) టీమ్‌ఇండియా చేరుకుంది. ఆసీస్‌తో జూన్‌ 7వ తేదీ నుంచి తలపడనుంది. ఈ క్రమంలో ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

Updated : 29 Apr 2023 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final 2023) ఫైనల్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. జూన్‌ 7వ తేదీ నుంచి ఆసీస్‌తో ఫైనల్‌లో తలపడనుంది. అజింక్య రహానెకు అవకాశం ఇస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ మాజీలు ప్రశంసలు కురిపించారు. టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. అయితే, రవిశాస్త్రి మాత్రం చాలా క్లారిటీగా జవాబు ఇచ్చేశాడు. 

‘‘ఎంఎస్ ధోనీని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు కదా. ఇప్పటికీ అతడు ఫిట్‌గా ఉన్నాడు. వికెట్‌ కీపర్ - బ్యాటర్‌గా సరిపోతాడు’’ అని రవిశాస్త్రిని యాంకర్ ప్రశ్నించగా..

దానికి సమాధానంగా.. ‘‘దేశంలో చాలా మంది యంగ్‌ వికెట్‌ కీపర్లకు ధోనీ మార్గదర్శి. అతడిని వికెట్ల వెనుక అనుసరించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండానే గొప్ప వికెట్‌ కీపర్‌గా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడు’’అని చెప్పాడు. 

‘ఒకవేళ ధోనీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని వస్తే అతడిని పరిగణనలోకి తీసుకుంటారా..? ’

‘‘ధోనీ రిటైర్‌మెంట్‌ను అస్సలు వెనక్కి తీసుకోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే అదే ఫైనల్‌ అవుతుంది. మరో సంవత్సరం ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు. ఆ నిర్ణయం ప్రకటించాడు. అతడు గణాంకాలను చూసే ఆటగాడైతే.. 100 టెస్టుల మార్క్‌ను దాటాక గుడ్‌బై చెప్పే అవకాశం ధోనీకి ఉంది. భారీ ప్రేక్షక సందోహం మధ్య, అద్భుతమైన ప్రెజెంటేషన్‌, వీడ్కోలు కార్యక్రమం.. ఇలా ప్రతి ఒక్కరూ కోరుకొనే విధానంలో కాకుండా చాలా సింపుల్‌గా నిర్ణయం వెల్లడించాడు. ఇప్పుడు జట్టులో కొత్త ఆటగాడు ఉన్నాడు. వారిని ఆడించాలి’’ అని రవిశాస్త్రి తెలిపాడు. 

ఇప్పుడు సమస్య అదే: గావస్కర్

జట్టు ఎంపికపై సునీల్‌ గావస్కర్‌ సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఓ సందేహాన్ని లేవనెత్తాడు. రిషభ్‌ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌గా కేఎస్ భరత్‌ను మేనేజ్‌మెంట్  ఎంపిక చేసింది. ఇప్పటికే జట్టులో కేఎల్ రాహుల్‌ కూడా ఉన్నాడు. అతడు కూడా కీపింగ్‌ చేయగల సమర్థుడే. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మనం తుది జట్టు గురించే మాట్లాడుకోవాలి. ఇప్పటికే జట్టును ప్రకటించేశారు. ఎవరెవరు ఫైనల్‌ XIలో ఆడతారు? కీపర్‌గా ఎవరిని తీసుకుంటారు? కేఎస్ భరత్‌కు అవకాశం ఇస్తారా..? లేదా కేఎల్ రాహుల్‌ను వినియోగించుకుంటారా? అనేది తెలియాలంటే మనం వేచి చూడాలి’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని