T20 League : సంజూకు ఆ సత్తా ఉంది.. ఉమ్రాన్‌ పేస్‌ బాగుంది: రవిశాస్త్రి

ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే...

Published : 31 Mar 2022 01:27 IST

ముంబయి: ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే సత్తా రాజస్థాన్‌ సారథి సంజూ శాంసన్‌ సొంతమని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ  కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్‌ 210/6 భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 149/7కే పరిమితమైంది. ‘‘ సంజూ శాంసన్‌ చాలా బాగా ఆడాడు. షాట్ సెలెక్షన్‌ బాగుంది. టర్నింగ్‌ పిచ్‌ కాదనే విషయాన్ని గ్రహించి దానికి తగ్గట్లుగా బౌండరీలను బాదాడు. అంతేకాకుండా బౌలర్ల పేస్‌ను ఉపయోగించుకుని చూడచక్కని షాట్లు కొట్టాడు. అందుకే ప్రపంచంలోని ఏ మైదానంలోనైనా పరుగులు చేయగల సత్తా సంజూకి ఉంది. పుణెలో బ్యాటింగ్‌ చేయడం అతడికి చాలా ఇష్టం. గతంలో ఇక్కడే సెంచరీ కూడా కొట్టాడు. ఇంకో ఐదు ఓవర్లపాటు ఉండి ఉంటే రాజస్థాన్‌ స్కోరు 230 దాటేదే. దేవదుత్ పడిక్కల్‌తో మంచి భాగస్వామ్యం నిర్మించాడు’’ అని రవిశాస్త్రి వివరించాడు. 

ఉమ్రాన్‌ మాలిక్‌ పేస్‌ బాగుంది.. 

రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ పేస్‌ ఎంతో ఆకట్టుకుందని రవిశాస్త్రి ప్రశంసించాడు. తొలి ఓవర్‌లోనే 21 పరుగులు సమర్పించుకున్న ఉమ్రాన్‌ ఆఖరికి 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 39 పరుగులే ఇచ్చాడు. ‘‘ఉమ్రాన్‌ నిలకడ, అతడి యాటిట్యూడ్ నచ్చాయి. నేర్చుకునే క్రమంలో ఉన్న మాలిక్‌ వద్ద అద్భుతమైన పేస్‌ ఉంది. సరైన ప్రాంతంలో బంతిని సంధిస్తే ఎంతటి బ్యాటరైనా కంగు తినాల్సిందే. అది అతడిని వాడుకోవడంపైనే ఆధారపడి ఉంది. ఉమ్రాన్‌తో కమ్యూనికేట్‌ చేసే విధానం చాలా ముఖ్యమని నా ఉద్దేశం’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని