Ravi Shastri : కార్తిక్.! ఇదే ఫామ్‌ కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా.. కానీ : రవిశాస్త్రి

ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్ కార్తిక్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు ఇదే ఫామ్‌ను సీజన్‌ ఆసాంతం కొనసాగిస్తే...

Published : 09 Apr 2022 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న టీమ్‌ ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్ కార్తిక్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు ఇదే ఫామ్‌ను సీజన్‌ ఆసాంతం కొనసాగిస్తే.. రానున్న ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడం సులభమేనని పేర్కొన్నాడు. కానీ, యువ వికెట్ కీపర్ల నుంచి అతడికి తీవ్ర పోటీ ఎదురవుతుందని చెప్పాడు.

‘ప్రస్తుతం టీమ్‌ ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే ఎదురుదాడికి దిగుతున్నాడు. అతడికున్న అనుభవాన్ని అంతా కూడగట్టి అలవోకగా షాట్లు ఆడుతున్నాడు. మేటి ఫినిషర్‌గా పేరున్న ధోని కూడా ప్రస్తుతం జట్టులో లేడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. అందుకే, మ్యాచ్‌ ఫినిషర్‌గా దినేశ్‌ కార్తిక్‌ని జట్టులోకి తీసుకోవాలి. కానీ, అదే సమయంలో జట్టులో ఎంత మంది కీపర్లు ఉన్నారనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి యువ వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం కార్తిక్‌ కూడా వారికి పోటీ ఇస్తున్నాడు. వీరిద్దరిలో ఎవరైనా గాయపడి జట్టుకు దూరమైతే.. అప్పుడు కార్తిక్‌కి అవకాశం ఓ దొరుకుతుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వీరితో పాటు ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో మరో వికెట్ కీపర్‌ సంజూ శాంసన్ కూడా మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, భారత జట్టు చోటు కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

ప్రస్తుత టీ20 లీగ్ 15వ సీజన్‌లో దినేశ్‌ కార్తిక్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టు తరఫున ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో.. 44 బంతులు ఎదుర్కొన్న కార్తిక్ 204.5 స్ట్రైక్‌ రేట్‌తో 90 పరుగులు చేశాడు. తొలి మ్యాచులో 14 బంతుల్లో 32, రెండో మ్యాచులో 7 బంతుల్లో 14, మూడో మ్యాచులో 23 బంతుల్లో 44 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని