Ravi Shastri: చెన్నై సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కనుగొనాలి: శాస్త్రి

భారత టీ20 లీగ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన, అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై ఇకపై విజేతగా నిలవాలంటే సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కనుగొనాలని...

Published : 24 May 2022 01:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన, అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై ఇకపై విజేతగా నిలవాలంటే సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కనుగొనాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఎన్నో ఏళ్లుగా రైనా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని, ఇప్పుడు ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా చేసుకోవాలంటే అలాంటి ఆటగాడిని వెతకాలని శాస్త్రి పేర్కొన్నాడు.

‘చెన్నై ఎన్నో ఏళ్ల పాటు చాలా గొప్పగా ఆడుతున్నా.. మనం రైనా లాంటి మేటి ఆడగాడిని మర్చిపోతూ ఉన్నాం. ఈ టీ20 లీగ్‌లో అతడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటుకున్నాడు. మూడో నంబర్‌లో బరిలోకి దిగుతూ నిలకడగా పరుగులు చేస్తూ జట్టుకు విలువైన స్కోర్‌ అందించేవాడు. తన బ్యాటింగ్‌తో ఇతరుల పని తేలిక చేసేవాడు. ఇప్పుడు చెన్నై అలాంటి ఆటగాడినే కనుగొనాల్సిన అవసరం ఉంది. మూడో స్థానంలో రాయుడు, ఉతప్ప ఆడుతున్నా రైనా లాంటి ఆటగాడిని తీసుకొస్తే ఆ ప్రభావం చాలా ఉంటుంది’ అని రవిశాస్త్రి వివరించాడు.

కాగా, సురేశ్‌ రైనా 2008 నుంచి 2019 వరకు చెన్నై టీమ్‌ తరఫునే ఆడాడు. 2016, 2017లో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు గుజరాత్‌ లయన్స్‌ తరఫున బరిలోకి దిగాడు. దీంతో మొత్తం 12 సీజన్లలో అతడు 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు చేశాడు. దీంతో టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఇప్పటికీ ఐదో స్థానంలో ఉన్నాడు. అలాంటి ఆటగాడిని చెన్నై ఈ ఏడాది మెగా వేలానికి ముందే వదిలేసుకుంది. అయితే, వేలంలో ఆ జట్టు తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశించినా అది జరగలేదు. మరోవైపు ఇతర జట్లు కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రైనా టీ20 లీగ్‌ కెరీర్‌కు తెరపడినట్లుగా అనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని