Dhoni: ఇప్పటికీ నా దగ్గర ధోనీ నంబర్‌ లేదు: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నాడు...

Updated : 27 Jan 2022 09:43 IST

సచిన్‌కైనా అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నాడు. ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, ఎప్పుడూ కోపంగా చూడలేదని చెప్పాడు. తాజాగా పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన శాస్త్రి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ‘మహీ డకౌటైనా.. శతకం సాధించినా.. ప్రపంచకప్‌ గెలిచినా.. తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరిగినా ఒకేలా ఉంటాడు. నేనెంతో మందిని చూశాను. కానీ, ధోనీ లాంటి ఆటగాడిని చూడలేదు. ఒక్కోసారి సచిన్‌కు కూడా టెంపర్మెంట్‌ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ, ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు’ అని శాస్త్రి వివరించాడు.

‘మహీ ఫోన్‌ వాడొద్దనుకుంటే అలాగే ఉండగలడు. తాను గ్యాడ్జెట్‌ పక్కన పెట్టాలనుకుంటే అలాగే పెట్టేస్తాడు. ఇప్పటికీ నా వద్ద అతడి ఫోన్‌ నంబర్‌ లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. నేనెప్పుడూ తన నంబర్‌ కూడా అడగలేదు. తను అసలు ఫోన్‌ దగ్గర పెట్టుకోడని నాకు తెలుసు. అతడిని సంప్రదించాలనుకుంటే ఎలా కనెక్ట్‌ అవ్వొచ్చో నాకు తెలుసు. ధోనీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు’ అని మాజీ కోచ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అలాగే విరాట్‌పై స్పందించిన అతడు.. కోహ్లీ మైదానంలో దిగితే గెలుపే లక్ష్యంగా ఆడతాడని, అక్కడ దేనీ గురించీ పట్టించుకోడని అన్నాడు. ఇక మైదానం బయట మాత్రం పూర్తి భిన్నంగా.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని తెలిపాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అతడు కొద్ది నెలలు విరామం తీసుకొని తిరిగి జట్టుకు ఆడితే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని