Ravi Shastri: ఆంటిగ్వాలో నేను ఇలా.. రవిశాస్త్రి పోస్టు వైరల్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 మ్యాచులను ఆడుతోంది. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మాజీ కోచ్ రవిశాస్త్రికి వింత అనుభవం ఎదురైంది.

Published : 22 Jun 2024 14:44 IST

(ఫొటో సోర్స్‌: రవిశాస్త్రి ఎక్స్‌)

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ ఆంటిగ్వాలోని వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య సూపర్‌-8 పోరు జరగనుంది. అయితే, రవిశాస్త్రి లగేజీ ఇంకా ఆంటిగ్వా చేరుకోలేదు. దీంతో బాత్‌రోబ్‌ను ధరించిన అతడు.. టిఫిన్‌ చేస్తున్న ఇమేజ్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దానికి రవిశాస్త్రి (Ravi Shastri) జోడించిన క్యాప్షన్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

‘‘అద్భుతమైన ఆంటిగ్వాలో ఇప్పుడు నేను ధరించిన ఈ అవుట్‌ఫిట్‌తో డ్రగ్‌లార్డ్‌గా అనిపిస్తున్నా. బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదిస్తున్నా. నా లగేజీ ఇంకా వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి రాలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా’’ అని రవిశాస్త్రి పోస్టు పెట్టాడు. లీగ్‌ స్టేజ్‌లో భారత్‌ మ్యాచులన్నీ న్యూయార్క్‌, ఫ్లోరిడా వేదికగా ఆడిన సంగతి తెలిసిందే. సూపర్‌-8లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌కు వేదిక బార్బడోస్. ఇప్పుడు బంగ్లాతో మ్యాచ్‌ను ఆంటిగ్వా మైదానంలో టీమ్‌ఇండియా (India vs Bangladesh) ఆడనుంది. 

బ్యాటింగ్‌కు అనుకూలమే కానీ..

ఆంటిగ్వా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, స్పిన్నర్లకు సహకారం లభించడం ఖాయం. కాస్త కుదురుకుంటే భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా-యూఎస్‌ఏ మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణ. సఫారీల జట్టు నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో యూఎస్‌ఏ దగ్గరగా వచ్చింది. ఒకదశలో దక్షిణాఫ్రికాకు ఓటమి భయం చూపించింది. అలాగే బౌలర్లూ రాణిస్తారనే దానికి బంగ్లా-ఆసీస్‌ మ్యాచ్‌ నిదర్శనం. ఇక్కడ బంగ్లాను 140 పరుగులకే ఆసీస్‌ బౌలర్లు కట్టడి చేయగలిగారు. కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేస్తే వికెట్లు తీయడం సులువే. ఏమాత్రం గతి తప్పినా బ్యాటర్ల దూకుడుకు బలి కావాల్సిందే. మన కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్-బంగ్లాదేశ్‌ (IND vs BAN) మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే అక్కడ చినుకులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. బౌలర్లకు ఇంకాస్త సహకారం లభించే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు