Published : 05 Jul 2022 14:33 IST

IND vs ENG : కనీసం రెండు సెషన్లు ఆడలేకపోయారా..? భారత ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌పై మూడు రోజులపాటు ఆధిక్యం సాధించిన భారత్‌ నాలుగో రోజు పట్టువిడిచింది. రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌లో అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ వెనకడుగు వేసింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయి విజయం వైపు దూసుకుపోతున్నారు. చివరి రోజు ఇంకో 119 పరుగులు చేస్తే గెలుపు సొంతం చేసుకోవడంతోపాటు సిరీస్‌ను సమం చేసే అవకాశం ఇంగ్లాండ్‌ ఎదుట ఉంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రదర్శనపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 132 పరుగులు సాధించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్‌ కావడం, రెండు సెషన్లపాటు బ్యాటింగ్‌ చేయకపోవడం సరైంది కాదని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్‌లో చర్చ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘భారత్‌ ప్రదర్శన తీవ్రంగా నిరాశపర్చింది. పోటీలోనే లేని వారికి (ఇంగ్లాండ్‌) అవకాశం కల్పించారు. నిన్న టీమ్‌ఇండియా కనీసం రెండు సెషన్లపాటు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు. తర్వాత వేగంగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ చేసేందుకు చాలా సమయం దక్కింది’’ అని తెలిపాడు. 

బుమ్రా వ్యూహాలు తప్పాయి: పీటర్సన్

టీమ్‌ఇండియా కెప్టెన్‌ బుమ్రా వ్యూహాల్లో తప్పిదం కూడా ఇంగ్లాండ్ పాలిట వరంగా మారిందని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. డిఫెన్సివ్‌గా ఫీల్డింగ్‌ పెట్టడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లకు షాట్లు కొట్టేందుకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాడు. ‘‘బుమ్రా వ్యూహాలు సరైనవి కాదని నా అభిప్రాయం. అంతేకాకుండా రివర్స్‌ స్వింగ్‌ బంతులు బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇక చివరి అర గంటలోనూ ఫీల్డింగ్‌కు సంబంధించి సరైన వ్యూహం లేదు’’ అని పీటర్సన్ వివరించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని