రవిశాస్త్రినే టీమ్‌ఇండియాకు ఆపాదించాడు 

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన దూకుడును భారత జట్టుకు ఆపాదించాడని, అది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అంటిందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రమిజ్‌ రాజా అభిప్రాయపడ్డారు...

Published : 19 Mar 2021 23:57 IST

అదే టీమ్‌ఇండియా మార్పునకు కారణం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన దూకుడును భారత జట్టుకు ఆపాదించాడని, అది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అంటిందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రమిజ్‌ రాజా అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమిజ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ ఇతర జట్లకు ట్రైలర్‌ లాంటిదని, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు ఆయా జట్లకు ఈ సిరీస్‌ ఉపకరిస్తుందని అన్నాడు.

‘పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఇతర జట్లు తమ నైపుణ్యాలు, ప్రణాళికలు మెరుగుపర్చుకునేందుకు ఈ సిరీస్‌ ఒక ట్రైలర్‌ లాంటింది. ఇప్పుడు మనం రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీ చూస్తున్నాం. అయితే, ప్రపంచకప్‌లో ఇంగ్లాండే అందర్నీ ఓడిస్తుందని నా అభిప్రాయం. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు విశేషంగా మెరుగైంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇంగ్లిష్‌ జట్టు అసలు వన్డేలు, టీ20లకు ప్రాధాన్యత ఇచ్చేదికాదు. ఇప్పుడు మాత్రం అద్భుతంగా పుంజుకుంది. భయం లేకుండా ఆడుతోంది’ అని రమిజ్‌ పేర్కొన్నాడు.

అనంతరం టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గురించి స్పందించిన పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌.. తాము ఆడే రోజుల్లో రవిశాస్త్రి భారత జట్టులో ఉండాల్సిన వ్యక్తి కాదనే అభిప్రాయంతో ఉండేవాళ్లమని చెప్పాడు. ఎందుకంటే శాస్త్రికి దూకుడు ఎక్కువ అని, అతడిది భిన్న స్వభావమని తెలిపాడు. మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి దంచికొట్టడమే పనిగా పెట్టుకునేవాడని రమిజ్‌ గుర్తుచేసుకున్నాడు. దాంతో తమ సారథి ఇమ్రాన్‌ఖాన్‌లా శాస్త్రి ఉండాలనుకున్నాడని తాము అనుకున్నట్లు చెప్పాడు. ‘అదే వైఖరిని శాస్త్రి ఇప్పుడు భారత జట్టుకు ఆపాదించాడనుకుంటా. అదృష్టంకొద్దీ అది కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి అంటింది. కోహ్లీ కూడా దూకుడుగా ఉంటూ తన వైఖరేంటో స్పష్టంగా చూపిస్తుంటాడు. అదే టీమ్ఇండియాలో పెద్ద మార్పునకు కారణం’ అని రమిజ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని