Updated : 04 Jun 2022 12:48 IST

French Open: ఆట ఉల్లాసాన్నే కాదు.. కన్నీళ్లూ పెట్టిస్తుంది!

పారిస్‌: నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. బంతి ఆడే ప్రయత్నంలో కిందపడి, నొప్పితో విలవిలాడిన జ్వెరెవ్‌.. నిరాశతో ఆట మధ్యలో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఆటలో కొదమ సింహాల్లా తలపడిన వీరు.. కోర్టు బయట ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని క్రీడా స్ఫూర్తిని చాటారు. దీనిపై నెటిజన్లు క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోపై మన క్రికెట్ దిగ్గజాలు కూడా స్పందించారు.

జ్వెరెవ్‌ తప్పుకోవాల్సి రావడంపై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి విచారం వ్యక్తం చేశారు. ‘ఇందుకే ఆటకు ఏడిపించే శక్తి కూడా ఉందనేది’ అంటూ ట్వీట్‌ చేశారు. జ్వెరెవ్ తప్పక తిరిగివస్తారని ఆకాక్షించారు. అలాగే రఫేల్ నాదల్ చూపిన క్రీడాస్ఫూర్తి, వినయం అమోఘం అంటూ కొనియాడారు. వారిద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. మన క్రికెట్ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ కూడా నాదల్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. నాదల్‌ చూపిన వినయం, శ్రద్ధ ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతాయంటూ ట్వీట్ చేశారు.

ఈ సంఘటన మినహా ఎర్రమట్టి కోర్టులో రఫెల్ నాదల్ తన హవా కొనసాగించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్ తుదిపోరుకు చేరుకున్నాడు. సెమీస్‌లో 7-6 (10-8), 6-6తో నాదల్‌ (స్పెయిన్‌) ఆధిక్యంలో ఉన్న దశలో జ్వెరెవ్‌ (జర్మనీ) గాయంతో తప్పుకున్నాడు. రెండు సెట్ల ఆట కూడా పూర్తి కాలేదు గానీ అందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఆటగాళ్లిద్దరూ పాయింట్ల కోసం ఏ స్థాయిలో తలపడ్డారో అర్థం చేసుకోవచ్చు. బంతిని అవతలికి పంపే ప్రయత్నంలో కింద పడ్డ జ్వెరెవ్‌ కుడి కాలు చీలమండకు తీవ్ర గాయమైంది. నొప్పితో అరుస్తూ విలవిల్లాడాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నడవలేకపోవడంతో అతణ్ని చక్రాల కుర్చీలో బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు తేల్చడంతో చేతి కర్రల సాయంతో కోర్టులోకి వచ్చిన అతను.. నాదల్‌తో కరచాలనం చేసి, వీక్షకుల కోసం చేతులు గాల్లోకి ఊపాడు. అయితే అప్పటికే అతడి ఆటతీరుతో మురిసిన వీక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే అతడు కన్నీళ్లతో కోర్టును వీడటం నాదల్‌నూ బాధించింది. అతను ఎన్నో గ్రాండ్‌స్లామ్‌లు గెలవాలని కోరుకున్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని