ఆటే కాదు బంధమూ బలపడింది

టెస్టుల్లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ...

Published : 08 Mar 2021 07:51 IST

సుందర్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలి
పంత్‌ శ్రమ ఫలిస్తోంది

ముంబయి

 టెస్టుల్లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ.. అనుభవాన్ని పంచుతున్న ఈ మాజీ ఆల్‌రౌండర్‌.. ఇంగ్లాండ్‌పై భారత్‌ టెస్టు సిరీస్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. బయో బుడగ ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచిందని అంటున్న శాస్త్రి.. కుర్రాళ్లు రిషబ్‌ పంత్, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌ ప్రదర్శనపై ఆదివారం వర్చువల్‌ విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

బబుల్‌మంచే చేసింది..

భారత జట్టు బయో బుడగలో సుదీర్ఘ కాలంగా ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడు ఆటగాళ్లకు వేరే అవకాశం ఉండదు. బయటకు వెళ్లలేరు. కొన్ని అనుమతించిన స్థలాల్లోనే తిరగాలి. బస చేసిన గది నుంచి బయటకు వస్తే జట్టు కలుసుకునే చోటకే వెళ్లాలి. అంటే దీని వల్ల మ్యాచ్‌ అయిన తర్వాత కూడా  క్రికెటర్లు ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కలవడం వల్ల ఆట గురించి చర్చ వస్తుంది. మా సమయంలో ఇలా మ్యాచ్‌ అయ్యాక కూడా ఎక్కువసేపు ఆట గురించి మాట్లాడుకునే వాళ్లం. బయో బుడగలో క్రికెట్‌ తప్ప వేరే ఆలోచనకు చోటే లేదు. వాళ్లకు అది తప్పనిసరి అయింది. అంతేకాదు క్రికెటర్ల మధ్య అనుబంధం పెరిగింది. ఒకరి నేపథ్యం గురించి మరొకరు తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చారో.. జీవితంలో స్థిరపడ్డారా.. ఇంకా స్థిరపడే దశలో ఉన్నారా.. మానసిక స్థితి ఎలా ఉంది లాంటి విషయాలను ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది. ఒకరితో ఒకరు వ్యక్తిగత విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడ్డాయి. ఇలాంటి ఎన్నో సానుకూలాంశాలు బయో బుడగలో ఉన్నాయి.

అందుకే ఈ విజయాలు..

ప్రస్తుత భారత జట్టు గెలవడాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక్కోసారి ఓటములు ఎదురైనా దిగులు పడట్లేదు. మళ్లీ సానుకూల ఫలితం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తోంది. ఆరు నెలలు ఆటగాళ్లు లాక్‌డౌన్‌లో గడిపిన సంగతి మాకు తెలుసు. అందుకే వారికి కుదురుకునే సమయం కావాలని అర్థం అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో విజయం ఈ కోవకే చెందుతుంది. ఈ గెలుపు తర్వాత టీమ్‌ఇండియా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. టీ20లతో పాటు చరిత్ర సృష్టిస్తూ టెస్టు సిరీస్‌ నిలబెట్టుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడినా... ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.

అతడికి నాకన్నా ఎక్కువే..

80ల్లో అప్పటి కెప్టెన్లు సునీల్‌ గావస్కర్, కపిల్‌దేవ్‌లకు నేను సేవలందించినట్లే ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుత భారత జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే నాతో పోలిస్తే సుందర్‌కు సహజసిద్ధమైన నైపుణ్యం మరింత ఎక్కువ. టెస్టుల్లో బౌలింగ్‌పై దృష్టి పెడితే అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. విదేశీ పిచ్‌లపై భారత్‌కు దొరికిన మెరుగైన ఆరో నంబర్‌ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. లోయర్‌ఆర్డర్‌లో అర్ధసెంచరీలు చేయడం.. 20 ఓవర్లు వేసి రెండు మూడు వికెట్లు తీయడం.. 80ల్లో భారత జట్టులో నా పాత్ర ఇదే. ఇప్పుడు సుందర్‌ ఇదే పాత్రను సమర్థంగా పోషించగలడు. అయితే దేశవాళీలో తమిళనాడుకు ఆడేటప్పుడు అతడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొలి నాలుగు స్థానాల్లో రావాలి. తమిళనాడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌తో ఈ విషయం గురించి మాట్లాడతా.

ఆ మార్పుల తర్వాత..

23 ఏళ్లలోపే రిషబ్‌ పంత్‌ నాలాగే విదేశాల్లో విజయవంతం అయ్యాడు. ఐపీఎల్‌ తర్వాత పంత్‌ చాలా బరువు పెరిగాడు. కానీ జిమ్‌లో కఠోరంగా శ్రమించి బాగా తగ్గాడు. ఆఫ్‌సైడ్‌ ఆటలోనూ మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తోంది శ్రమ ఆ ఫలితాలే. తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడితే పంత్‌ తిరుగులేని మ్యాచ్‌ విన్నర్‌. ఆఫ్‌ స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు. చాలా ఏళ్లుగా జట్టుతోనే ఉంటూ వస్తున్నాడు. కానీ గాయాలు కావడంతో దురదృష్టం కొద్దీ జట్టుకు దూరమయ్యాడు. దీని వల్ల జడేజా, కృనాల్‌ పాండ్యలకు అవకాశాలొచ్చాయి. ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాక దొరికిన అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకున్నాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా లేని లోటుని అతను తెలియనీయలేదు. అశ్విన్, జడేజా, అక్షర్‌ కలిసి ఆడితే చూడాలని ఉంది.

ఎందుకు మార్చారో?

అక్టోబర్‌ వరకు టీమ్‌ఇండియా టెస్టుల్లో మూడు సిరీస్‌లు గెలిచి ఒక దాంట్లో ఓడి 360 పాయింట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉంది. కానీ ఒక వారం గడిచాక పరిస్థితి మారిపోయింది  మేం మూడో స్థానానికి పడిపోయాం. దీనికి కారణం ఈ ఛాంపియన్‌షిప్‌లో నిబంధనను ఐసీసీ పాయింట్ల పద్ధతి నుంచి శాతాలకు మార్చింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించినా మేం పెద్దగా మెరుగుపడలేదు. ఒకవేళ ఆసీస్‌పై గెలవకపోతే స్వదేశంలో   ఇంగ్లాండ్‌పై 4-0తో గెలిచినా ఫైనల్‌ అర్హత సాధించే వాళ్లం కాదేమో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని