IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి

ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో టీమ్‌ఇండియా మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)ని తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు.

Published : 08 Feb 2023 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ) జరగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని పలువురు క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. బంతి, బ్యాట్‌తో రాణించగలిగే రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా తుదిజట్టులో ఉండటం ఖాయం. మూడో స్పిన్నర్‌ స్థానం కోసం కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav), అక్షర్‌ పటేల్ మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కూడా జట్టు యాజమన్యానికి కీలక సూచన చేశాడు. మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌కు బదులు కుల్‌దీప్‌ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని రవిశాస్త్రి (Ravi Shastri) సూచించాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలాగా అక్షర్ పటేల్ బౌలింగ్‌ చేస్తాడని పేర్కొన్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ మొదటి రోజు నుంచే బంతిని తిప్పగలుగుతాడని రవిశాస్త్రి చెప్పాడు.   

‘మూడో స్పిన్నర్‌గా నేనైతే నేరుగా కుల్‌దీప్‌ యాదవ్‌ని ఎంచుకుంటా. మనకు రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజా, అక్షర్‌ పటేల్‌లు సారూప్యమైన బౌలర్లు. కుల్‌దీప్‌ భిన్నం. ఒకవేళ టాస్‌ ఓడిపోయి బంతిని స్పిన్‌ చేయాలనుకుంటే తొలి రోజు నుంచి బంతిని తిప్పగలిగేది కుల్‌దీప్‌ మాత్రమే’ అని రవిశాస్త్రి వివరించాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా కూడా ప్రణాళికాబద్ధంగానే సిరీస్‌కు సిద్ధమతున్నట్లు కనిపిస్తోంది. నెట్‌ సెషన్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆ జట్టు బ్యాటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టులో నాథన్‌ లైయన్‌, అస్టన్‌ అగార్‌, స్వెప్సన్‌, టాడ్‌ మర్ఫీల రూపంలో ప్రతిభావంతులైన స్పిన్నర్లున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని