Ashwin : కపిల్‌లా కావాలనుకున్నా...

చిన్నప్పుడు తాను బ్యాట్స్‌మన్‌ కావాలనుకున్నానని, కపిల్‌దేవ్‌లా ఎదగడం కోసం మీడియం పేస్‌ వేసే వాడినని భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వెల్లడించాడు. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా అశ్విన్‌..

Updated : 09 Mar 2022 07:17 IST

బెంగళూరు

చిన్నప్పుడు తాను బ్యాట్స్‌మన్‌ కావాలనుకున్నానని, కపిల్‌దేవ్‌లా ఎదగడం కోసం మీడియం పేస్‌ వేసే వాడినని భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వెల్లడించాడు. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా అశ్విన్‌.. కపిల్‌ (434 వికెట్లు)ను అధిగమించి భారత్‌ తరఫున టెస్టుల్లో రెండో విజయవంతమైన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘28 ఏళ్ల కింద కపిల్‌ పాజీ.. రిచర్డ్‌ హ్యాడ్లీని అధిగమించినప్పుడు నేను, మా నాన్న ఎంతో సంబరపడ్డాం. వికెట్లలో అతణ్ని అధిగమిస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్‌ ఆడడం మొదలు పెట్టిన నేను.. బ్యాట్స్‌మన్‌ కావాలనే అనుకునేవాణ్ని. 1994లో బ్యాటింగ్‌ అంటే చాలా మోజు ఉండేది. అప్పుడప్పుడే సచిన్‌ దూసుకొస్తున్నాడు. కపిల్‌దేవ్‌ కూడా బంతిని బాగా బాదేవాడు. తర్వాతి కపిల్‌దేవ్‌ను కావాలన్న ఉద్దేశంతో మీడియం పేస్‌ వేసే వాడిని. అక్కడి నుంచి ఆఫ్‌స్పిన్నర్‌ను అవుతానని, ఇన్నేళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అనుకోలేదు. కపిల్‌ను అధిగమించినందుకు సంతోషంగా ఉంది’’ అని అశ్విన్‌ చెప్పాడు.

అది నా ఫేవరెట్‌ వార్న్‌ డెలివరీ..: దివంగత ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌ వార్న్‌ బౌలింగ్‌ను పునర్‌ నిర్వచించాడని, స్పిన్‌ను ఎటాకింగ్‌ సాధనంగా మార్చాడని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌ అన్నాడు. ‘‘ప్రపంచ క్రికెట్లో స్పిన్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపిన వ్యక్తిగా వార్న్‌ను నేను పరిగణిస్తా. మురళీధరన్‌, వార్న్‌, రూపంలో క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ముగ్గురు స్పిన్నర్లే’’ అని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అశ్విన్‌ చెప్పాడు. ‘‘అతడో ఆసక్తికరమైన వ్యక్తి. ఎంతో మంది ఆస్ట్రేలియా దిగ్గజాలు అతడి గురించి ఎన్నో మంచి విషయాలు చెబుతారు. జీవితం మరీ ఇంత అస్థిరమైందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఏం జరుగబోతోందో ఊహించలేం. వార్న్‌ ఓ జనరంజక వ్యక్తి. బౌలింగ్‌ను అతడు పునర్‌నిర్వచించాడు. 1000కి పైగా అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఈ అరుదైన ఘనత చాలా కొద్దిమందికే సాధ్యమవుతుంది’’ అని అన్నాడు. ‘‘వార్న్‌ స్పిన్‌ను ఓ ఎటాకింగ్‌ సాధనంగా క్రికెట్‌ ప్రపంచంలోకి తెచ్చాడు. ప్రతి ఒక్కరూ అతడు మైక్‌ గ్యాటింగ్‌కు వేసిన డెలివరీ గురించి మాట్లాడతారు. కానీ నా ఫేవరెట్‌ వార్న్‌ డెలివరీ మాత్రం 2005 యాషెస్‌లో స్ట్రాస్‌కు వేసిందే’’ అని అశ్విన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని