Ravichandran Ashwin: మా ఇంట్లోకి ఎవరు రావాలో నేనే డిసైడ్‌ చేస్తా: ఎలాన్‌ మస్క్‌కు అశ్విన్‌ పోస్ట్‌

Ravichandran Ashwin: తన టైమ్‌లైన్‌లో వచ్చిన ఓ పోస్ట్‌పై క్రికెటర్‌ అశ్విన్‌ అసహనం వ్యక్తంచేశాడు. దీనిపై ‘ఎక్స్‌’ యజమాని ఎలాన్‌ మస్క్‌కు ఓ రిక్వెస్ట్‌ పెట్టాడు.

Updated : 24 Jun 2024 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌పై అసూయతో ఓ పాక్‌ జర్నలిస్టు చేసిన పోస్ట్‌.. టీమ్‌ఇండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)కు కోపం తెప్పించింది. పైగా అది తన టైమ్‌లైన్‌లో కన్పించడంతో తీవ్ర అసహనానికి గురైన ఈ సీనియర్‌ స్పిన్నర్‌.. వెంటనే ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు రిక్వెస్ట్‌ పెట్టాడు. తన ఇంట్లోకి ఎవరు రావాలో తానే డిసైడ్‌ చేయాలన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ (T20 Worldcup 2024)లో ఈసారి సంచనాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సూపర్‌-8లో మాజీ ఛాంపియన్, మేటి జట్టు ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ (AUS vs AFG) విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు వజాహత్‌ కజ్మీ తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశాడు. అందులో భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘‘అఫ్గానిస్థాన్‌ ఈ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదు కానీ భారత్‌పై గెలవలేదు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. ఐపీఎల్‌ కాంట్రాక్టులు చాలా విలువైనవి’’ అంటూ అతడు నోరు పారేసుకున్నాడు.

భారత ప్రధాన కోచ్‌ పదవి.. గంభీర్‌ పెట్టిన ఐదు కండీషన్లు ఇవేనా!

అయితే, ఈ పోస్ట్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)కు తన ‘ఎక్స్‌’ టైమ్‌లైన్‌లో కన్పించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఈ సీనియర్‌ బౌలర్‌.. మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘‘ఏం చేయాలో నేను మీకు (మస్క్‌) చెప్పలేను. కానీ మా ఇంట్లోకి ఎవరు ప్రవేశించాలన్నది నిర్ణయించుకునే హక్కు నాకు కచ్చితంగా ఉండాలి. నా టైమ్‌లైన్‌. నా నిర్ణయం’’ అని క్రికెటర్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

గతంలో ‘ఎక్స్‌’ ట్విటర్‌గా ఉన్న సమయంలో యూజర్లు ఎవరినైనా ఫాలో చేస్తే వారు చేసే పోస్టులు మాత్రమే టైమ్‌లైన్‌లో కన్పించేవి. అయితే ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎలాన్‌ మస్క్‌ అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇందులోభాగంగానే ‘For You’ అనే ఆప్షన్‌ తీసుకొచ్చారు. దీంతో యూజర్ల టైమ్‌లైన్‌లో వారు ఫాలో చేయని వ్యక్తులు చేసే పోస్టులు కూడా కన్పిస్తాయి. యూజర్లు ఆసక్తి చూపించే అంశాలకు సంబంధించిన సమాచారం ఉండే పోస్ట్‌లను ఇందులో చూపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు