
ఏబీడీ.. ఇన్నేళ్లు నీ బ్యాటింగ్ చూడటం అద్భుతంగా ఉంది: అశ్విన్
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్‌కు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ మాజీ స్టార్ బ్యాటర్ నిన్న (శుక్రవారం) పూర్తిగా క్రికెట్‌కే వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏబీడీ నిర్ణయంపై అశ్విన్ స్పందించాడు. ‘‘నీ అద్భుతమైన క్రికెట్ కెరీర్‌కు కంగ్రాట్స్ ఏబీడీ. ఇన్నేళ్లపాటు నీ సూపర్ బ్యాటింగ్‌ను ఆస్వాదించడం చాలా అద్భుతంగా ఉంది. మున్ముందు జీవితంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా.. గుడ్‌లక్’’ అని ట్వీట్ చేశాడు. ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. వీడ్కోలు ప్రకటనతో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ఏబీడీ అందుబాటులో ఉండకపోవడం ఆర్‌సీబీకి షాకే.
‘మిస్టర్ 360’గా పేరొందిన ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ శైలి ప్రత్యేకమైందిగా క్రికెట్ సౌత్‌ఆఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్, మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ అభివర్ణించాడు. ‘తనదైన శైలిలో ఏబీ బ్యాటింగ్ చేసేవాడు. అతడితో ఆడటమే కాకుండా ఏబీకి కెప్టెన్‌గా వ్యవహరించడం నా అదృష్టం. అతడు జట్టు మనిషి. సారథి ఏం కోరుకుంటున్నాడో ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడు. బ్యాటర్, బౌలర్, వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు సేవలందించాడు. అంతేకాకుండా అద్భుతమైన ఫీల్డర్ కూడానూ. తాము ఎలాంటి సూచనలు ఇవ్వకపోయినా జట్టుకు అవసరమైనప్పుడు ఆ పాత్రను పోషించేవాడు’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
► Read latest Sports News and Telugu News