Ashwin: మాది బలమైన జట్టు.. విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్‌

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు(Team India)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) ఘాటుగా స్పందించాడు.

Published : 26 Mar 2023 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు(Team India)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) ఘాటుగా స్పందించాడు. మాది బలమైన జట్టు అని పేర్కొన్నాడు. సిరీస్‌ మూడు మ్యాచుల్లోనూ తొలి బంతికే డకౌట్‌ అయ్యి సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా, సూర్యకుమార్‌ను కొందరు మాజీలు విమర్శస్తున్నారు. జట్టు యాజమాన్యం, కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మాజీలు సూర్యకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంపై తాజాగా అశ్విన్‌ స్పందించాడు. 

‘‘శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగోస్థానంలో మాకు స్థిరమైన ఆటగాడు లేడు.  మూడు మ్యాచుల్లోనూ సూర్య డకౌట్‌ అయ్యాడు. దాంతో అతడు వన్డే క్రికెట్‌ ఆడగలడా లేదా అని ప్రశ్నలు మొదలయ్యాయి. భారత్‌ ఓడినప్పటి నుంచి ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. దాన్ని అంతగా విశ్లేషించాల్సిన అవసరం లేదు.  టీమ్‌ఇండియా ఎప్పుడూ గెలవాలనే  పట్టుదలతోనే ఉంటుంది. టీమ్‌ఇండియా బలమైన జట్టు అని భారత క్రికెట్‌ అభిమానుల ప్రగాఢ నమ్మకం. మాది బలమైన జట్టు. ఆ విషయంలో సందేహమే లేదు.  జట్టు ఓడిపోయినప్పుడు అభిమానుల నుంచి వచ్చే అభిప్రాయాలు  కఠినంగా ఉండొచ్చు. కానీ, పలువురు క్రికెట్‌ నిపుణులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇది వారికి కీలకమైన సమయం. వారు చాలా క్రికెట్‌ ఆడారు కాబట్టి తమ అభిప్రాయాలు వ్యక్తపరిచే ముందు వారు బాధ్యతగా వ్యవహరించాలి.  ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తమ ఆలోచనలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. కాబట్టి  ఈ అంశంపై మనం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. మేము 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలవడానికి ప్రధాన కారణం జట్టులో ఉన్న స్థిరత్వమే. అనవసర విమర్శల వల్ల జట్టు స్థిరత్వం దెబ్బతినే ప్రమాదముంది’’ అని పేర్కొన్నాడు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు